వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆహో.. ఓహో అంటూ ఓవరాక్షన్ చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు..! ఏ క్షణాన అధికారం పోయిందో అప్పుడు నా అనుకున్న వాళ్లు ఒక్కరంటే ఒక్కరూ.. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ లేరు..! అబ్బే.. అధికారం లేనప్పుడు ఆయనతో పనేముంది..? మనదారి మనది అనుకున్నారేమో కానీ అడ్రస్ లేకుండా పోయారు.. కనీసం పలకరింపు కూడా లేదంటే అర్థం చేసుకోండి..! ఓ వైపు గడ్డు పరిస్థితుల్లో పార్టీ, నేతలు జంపింగ్‌లు, కేసులు.. కోర్టులు, అరెస్టులు ఇలా ఒకటా రెండా వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది..! ఇప్పుడు కనుచూపు మేరలో కనీసం నమ్మినబంటులు కూడా కనిపించకపోవడం గమనార్హం.
ఆళ్ల.. అడ్రస్ లేరేం..!
ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.. నమ్మినబంటు కూడా..! వైసీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ఓ వెలుగు వెలిగిన నాయకుడు. జగన్‌కు అన్నీ తానై వ్యవహరించిన ఆళ్ల ఇప్పుడు అడ్రస్ లేరు..! నియోజకవర్గంలోనే కాదు కదా.. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పోనీ.. కష్టాల్లో ఉన్న పార్టీకి అండగా ఉండాల్సిన టైమ్‌లో ఎందుకు ఆయన దూరం.. దూరం అంటున్నారనేది కూడా అర్థం కావట్లేదట. నాడు ప్రత్యర్థులపై కేసులు అంటే చాలు ఆళ్ల పేరే అందరికీ గుర్తొచ్చేది.
ఇందుకేనా..?
నాడు ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్‌లోనే, జగన్‌తోనే ఉండే ఆళ్ల ఎందుకు కనిపించట్లేదు.. వినిపించట్లేదు అనేది వైసీపీ కార్యకర్తలకు అర్థం కాని విషయం. అంతేకాదు.. ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని అన్నీ తానై చూసుకున్న రామకృష్ణారెడ్డికి ఇటీవలే సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాజకీయ కక్షలు ఉంటే బయట చూసుకోండి అంటూ ఆళ్ల పిటిషన్లను తోసిపుచ్చింది కోర్టు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా ఆళ్లను ఎందుకు టీడీపీ సర్కార్ టచ్ చేయలేదన్నది పెద్ద మిస్టరీనే. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్ రావడంతో త్వరలోనే జగన్ నమ్మినబంటును అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే పరోక్ష సంకేతాలు కూడా ఆళ్లకు వెళ్లాయనే చర్చలు సాగుతున్నాయి. అందుకే ఇక రాజకీయాలు, కేసులకు దూరంగా ఉండాలని ఆయన భావించి ఉండొచ్చేమో..!