బైరెడ్డి సిద్దార్థరెడ్డి.. వైసీపీ కండువా కప్పుకున్న నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన యూత్ లీడర్..! యువతలో మంచి ఫాలోయింగ్, వాక్ చాతుర్యంతో ఆకట్టుకునేవారు..! ఏ పని అప్పగించినా వందకు 200 శాతం న్యాయం చేసేవారు..! పార్టీకి యువనేత చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శ్యాప్ చైర్మన్ పదవిని బైరెడ్డికి కట్టబెట్టారు..! దీంతో పాటు యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2024 ఎన్నికల్లో అధికారం పోయింది.. బైరెడ్డికి ఉన్న పదవులు పోయాయ్..! ఐతే ఇప్పుడు వైసీపీకి ఆయన అవసరం లేదా..? లేదంటే బైరెడ్డికే పార్టీ అక్కర్లేదా..? అనేది అర్థం కాని పరిస్థితి.
ఏం జరుగుతోంది..?
వైసీపీ అధికారం పోయిన తర్వాత నంద్యాల రేప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనలో హడావుడి చేసిన బైరెడ్డి ఆ తర్వాత అడ్రస్ కనిపించలేదు. ఐతే ఏమయ్యాడో ఏమో తెలియట్లేదు కానీ యువనేత కనిపించలేదు.. వినిపించనూ లేదు. పార్టీకి ఆయన అక్కర్లేదు అనుకున్నారో లేదంటే.. ఆయనకే పార్టీ అక్కర్లేదో కానీ ఎన్నెన్నో విచిత్రాలు వైసీపీలో జరిగిపోతున్నాయి. మొన్నటి వరకూ
యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న బైరెడ్డి ఆ పదవి పీకేసి.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఇచ్చింది హైకమాండ్. వైసీపీలో యూత్ అంటే బైరెడ్డి.. బైరెడ్డి అంటే యూత్ అన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది. ఐతే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఏమైందో ఏమో..?
నందికొట్కూరు నియోజకవర్గమే కాకుండా.. కర్నూలు జిల్లా మొత్తం తనదే అని జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నని రోజులూ ఏదో విధంగా మీడియాలో కనపడుతూ వచ్చేవారు. ఐతే ఎప్పుడైతే అధికారం పోయిందో నాటి నుంచి నందికొట్కూరులో పట్టు మొత్తం పోయిందనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ సహా 16 మంది కౌన్సిలర్లు వైసీపీకి జెండా ఎత్తేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐతే వీరిని కాపాడుకునేందుకు కనీస ప్రయత్నాలు కూడా బైరెడ్డి చేయలేదట. దీంతో వైసీపీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. నియోజకవర్గంపై పట్టు కోల్పోయిన.. నేతలను కాపాడుకోలేకపోయిన బైరెడ్డి రాష్ట్రం మొత్తం యువతను ఏ మాత్రం మేనేజ్ చేస్తారు..? అసలు అవన్నీ అయ్యే పనులేనా..? అని హైకమాండ్ ఆలోచించి ఇప్పటి వరకూ ఎలాంటి పదవి ఇవ్వలేదు అనే చర్చ వైసీపీలో గట్టిగానే జరుగుతోంది.
ఎవరేం తక్కువ కాదు..!
యువజన విభాగం అధ్యక్షుడిగా ఇన్నాళ్ళు తన పదవికి న్యాయం చేశారు బైరెడ్డి. ఎన్నికల ప్రచారం మొదలు, ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడం ఇలా అన్నిటిలోనూ 100కు 100 మార్కులు సంపాదించుకున్న యువనేతను ఎందుకో పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆఖరికి ఆయనకున్న పదవిని సైతం పీకేయడంతో ఎక్కడో ఏదో తేడాగానే ఉందని యూత్ భావిస్తోంది. ఇక జక్కంపూడి రాజా విషయానికొస్తే ఈయనేం బైరెడ్డి కంటే తక్కువ ఏమీ కాదు. యువతను ఆకట్టుకునే విధంగా మాట్లాడటం, పంచ్ డైలాగ్స్, విమర్శలు గుప్పించడంలో ఆరితేరిన వ్యక్తే. వీటన్నిటికీ మించి వైఎస్ ఫ్యామిలీ అంటే పడి చచ్చేలా ఉంటుంది జక్కంపూడి ఫ్యామిలీ. నాడు వైఎస్ నుంచి నేటి జగన్ వరకూ వైఎస్ ఫ్యామిలీతో ఉంది. నమ్మిన వారికి న్యాయం చేయడంలో ముందు ఉండే జగన్.. రాజాకు యువజన విభాగం ఇచ్చారు. ఈయన ఎంతవరకూ యువతను ఆకట్టుకుంటారో..? అనేది చూడాలి మరి. బైరెడ్డికి జగన్ ఏదో ఒక పదవి ఇస్తారో లేదంటే లైట్ తీసుకుంటారో జస్ట్ వెయిట్ అండ్ సీ.