ఈరోజు ఉదయమే కింగ్ నాగార్జున కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తుమ్మడి కుంటల చెరువుని కబ్జా చేసి నాగార్జున N కన్వెన్షన్ ని నిర్మించినట్లుగా ఫిర్యాదులు అందడంతో హైడ్రా ఈరోజు ఉదయమే N కన్వెన్షన్ ని కూల్చివేసే పని చేపట్టింది. అక్కడికి మీడియాని కూడా అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
N కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. N కన్వెన్షన్ కూల్చివేయడం బాధగా అనిపించింది. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా N కన్వెన్షన్ ని కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని తెలియజేయడం కోసమే ఇలా స్పందించాల్సి వచ్చింది.
ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. ఈరోజు ఉదయం కూల్చివేత చేపట్టే ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉంది, అలాంటప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఈ కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని కానీ అలా జరగలేదు.
ఇప్పుడు మేము ఆక్రమణలు చేసి తప్పుడు నిర్మాణాలు చేపట్టామని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఇలా స్పందించాల్సి వచ్చింది. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము కోర్టుని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ నాగ్ ట్వీట్ చేసారు.