అనిల్ కుమార్ అడ్రస్ లేడేం..?
అనిల్ కుమార్ యాదవ్.. ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్! వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈయన ఆడిందే ఆట.. పాడిందే పాట..! మీడియా ముందుకు వస్తే చాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌తో పాటు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడేవారు..! అవతలి వ్యక్తి ఎవరనేది చూడకుండానే నోటికి ఎంత మాట అంత మాట్లాడేసేవారు..! ఎవ్వర్నీ లెక్కచేసేవారు కాదు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప డోంట్ కేర్ అనేవారు..! ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతో మంది సీనియర్లు, గురువులు ఉన్నప్పటికీ అబ్బే అస్సలు లెక్క చేయకుండా సొంత ఇలాకా నుంచి.. గుంటూరుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు..! అంతేకాదు.. ఎమ్మెల్యే పదవి నుంచి ప్రమోషన్‌గా నరసారావుపేటకు ఎంపీ అభ్యర్థిగా పోయి బొక్క బోర్లా పడ్డారు..! 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనిల్ అడ్రస్ కోసం అభిమానుల నుంచి హైకమాండ్ వెతుకుతున్న పరిస్థితి..!
ఏ..క్కడా..!
నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. పదవులూ అనుభవించారు. వైఎస్ హయాంలో ఆనం బ్రదర్స్ ఓ వెలుగు వెలిగారు. ఈ ఫ్యామిలీ గుప్పెట్లోనే సగానికి పైగా జిల్లా ఉండేది. సరిగ్గా ఈ సమయంలోనే 2009లో ఆనం అనుచరుడిగా, శిష్యుడిగా అరంగేట్రం చేసిన అనిల్.. తొలిసారి ఓడిపోయి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున మంచి మెజార్టీతోనే గెలిచారు. 2019లో ఏకంగా పొంగూరి నారాయణను ఢీకొని 2,988 ఓట్ల మెజార్టీతో ఢీకొట్టి గెలిచి నిలిచారు. యంగ్ లీడర్, యాదవ సామాజిక వర్గం కావడంతో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో మంత్రి పదవి అది కూడా నీటి పారుదల శాఖ దక్కింది. రెండేళ్లకే మంత్రి పదవి పోయింది.. అనంతరం ఉన్న నెల్లూరు సిటీ నియోజకవర్గమూ పోయింది. నరసారావుపేటకు వెళ్లి అటు నుంచి ఎటువెళ్లిపోయారో అడ్రస్ లేరు..!
కనిపించలే.. వినపడలే!
అధికారంలో ఉన్నన్ని రోజులు అబ్బో ఓ రేంజిలో రెచ్చిపోయిన అనిల్.. ఎప్పుడైతే ఎన్నికలు అలా ముగిశాయో అప్పట్నుంచి కనిపించట్లేదు.. ఆయన మాట కూడా ఎకూడా వినిపించట్లేదు. ఆ మధ్య పోలింగ్ రోజు, ఎన్నికల తర్వాత పల్నాడు గొడవల్లో కనిపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ వెంట వెళ్లి నెల్లూరు సెంట్రల్ జైలులో పరామర్శ పాల్గొని నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా లేరు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత జరుగుతున్నా.. వైసీపీలో పరిస్థితులు, కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నా అబ్బే వాయిస్ లేదు. కనీసం కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు కూడా అందుబాటులో లేకపోవడంతో అసలు అనిల్ వైసీపీలో ఉన్నాడా లేదా..? పోనీ రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా..? అనే అనుమానాలు సర్వత్రా వస్తున్నాయ్..! దీనికి తోడు నరసారావుపేటలో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పెద్ద పెద్ద చాలెంజ్‌లే చేశారు.. కొంపదీసి సన్యాసమే తీసుకున్నారో ఏమో అనేది అర్థం కావట్లేదు. ఫోన్లకు దొరకట్లేదు.. కనీసం అనుచరులకు అగుపించట్లేదు.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు.. ఇవన్నీ కాదని ఇంకేం చేస్తున్నారో ఏంటో అనిల్‌కే తెలియాలి మరి.