మరో యాత్రకు కేసీఆర్ రెఢీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని పార్టీ చేసిన భగీరథ ప్రయత్నంతో పత్తానే లేకుండా పోయింది..! నాటి నుంచి నేటి వరకూ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం అడ్రస్ లేరు..! అదేంటి అంటే సారు ఫామ్ హౌసులో పడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఖరికి సొంత పార్టీ నేతలే సారును తిట్టి పోస్తున్నారు. మౌన వ్రతం ఇక చాలు.. ప్రజల్లోకి రండి అనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
ఇక చాలు రండి!
రుణమాఫీ, ధరణి, ఎమ్మెల్యేల జంపింగ్స్, కీలక నేతల రాజీనామాలు, ప్రాజెక్టుల విషయాల్లో గొడవ, రైతన్నల ఆత్మహత్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, విగ్రహాల రచ్చ.. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయ్. ఇందులో ఏమున్నా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఆఖరికి అసెంబ్లీలో సైతం.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ అందరికీ బావ బామ్మర్ది సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇంత జరిగినా.. జరుగుతున్నా కేసీఆర్ బయటికి రాకపోతే ఆయన్ను జనాలు మరిచిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇక వచ్చేయండి అని కార్యకర్తలు, నేతలు మొత్తుకుంటున్నారు.
ఎప్పుడు వస్తారో..!
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఆ మధ్య అసెంబ్లీలో మెరుపు తీగలా మెరిసిన గులాబి బాస్ ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. దీంతో కార్యకర్తలు, నేతల్లో కొంచం కొంచం బాసుపై విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే క్యాడర్, రైతుల్లో భరోసా నింపేందుకు విచ్చేస్తున్నారని.. దీనికి సరికొత్త ప్లాన్ రచించారని సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలని.. ఇందుకు ముక్కుపిండి మరీ అమలు చేపించే బాధ్యతను కేసీఆర్ తీసుకోబుతున్నారట. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ ప్రతీ రైతుకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మాఫీ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి రంగం సిద్ధం అయినట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని.. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ యాత్ర ఎప్పుడో..? ఏం జరుగుతుందో..? చూడాలి మరి.