కింగ్ నాగార్జునకు హైడ్రా షాకిచ్చింది. నాగార్జున మాదాపూర్ లో నిర్మించిన N కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. చెరువుకు సంబందించిన ప్రాంతాన్ని ఆక్రమించి నాగార్జున N కన్వెన్షన్ ని నిర్మించారని, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే ఊరుకోబోమని హైడ్రా గత కొద్దిరోజులుగా హెచ్చరిస్తున్నట్టుగానే ఆయా నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టింది.
N కన్వెన్షన్ కి వెళ్లే దారులన్నీ బారి గేట్లు పెట్టి మీడియాకి అనుమతి లేదు అంటూ అక్కడ కూల్చివేత దృశ్యాలను కూడా భారీ బందోబస్తు మధ్యన చేపట్టింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అధికారులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ఎలాంటి ప్రముఖుల బిల్డింగ్ ని అయినా కూల్చి వేస్తున్నారు.
ఈరోజు ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకొని కూల్చివేతలు ప్రారంభించారు. హైటెక్ సిటీకి దగ్గరలోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసుకొని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించినట్లు గత కొంత కాలంగా ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.