వైసీపీలో ప్రక్షాళన మొదలైందా..?
సొంత ఇలాకా కడప గడప నుంచే అధినేత వైఎస్ జగన్ షురూ చేశారా..? అంటే జడ్పీ చైర్మన్ మొదలుకుని జిల్లా ఇంచార్జి వరకూ మార్పులు, చేర్పులు చేస్తుండటంతో నిజమే అనిపిస్తోంది. మరోవైపు.. సొంత ఇంటి నుంచి కూడా మార్పునకు మాజీ సీఎం శ్రీకారం చుట్టారు. ఏంటి.. ఈ మార్పు..? సొంత జిల్లాలో ఏమైంది..? సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టారనే చర్చ సైతం జరుగుతోంది.
మొదలైనట్టే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రెస్స్ లేకుండా పోయిన వైసీపీని గాడిలో పెట్టడానికి.. నియోజకవర్గాలు, జిల్లాల నుంచి పోస్టుమార్టం మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, అస్థవ్యస్థ పాలనతో ప్రజావ్యతిరేకత.. మూటగట్టుకోవడమే ఘోర పరాజయానికి కారణం అని తెలుసుకున్న జగన్ ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదని అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందుకు సొంత ఇలాకా ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే షురూ చేశారు. ఇప్పటికే కౌన్సిలర్లు, సర్పంచులు, మున్సిపల్ చివరికి జడ్పీని కైవసం చేసుకోవడానికి టీడీపీ కూటమి పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
అవినాష్ ఔట్..!
వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణాంతరం కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లాను చూసుకునేవారు. కానీ ఎందుకో ఏమైందో తెలియట్లేదు కానీ తమ్ముడిని పక్కన పెట్టారు జగన్. దీనిపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అవినాష్ రెడ్డే తనకు తానుగా దూరం జరిగారా..? లేదంటే జగన్ మోహన్ రెడ్డే దూరం పెట్టారా..? అనేది తెలియట్లేదు.
ఓహ్ ఇందుకా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఎంపీ అవినాష్ రెడ్డిని అతి త్వరలోనే వివేకా హత్య కేసులో అరెస్ట్ అవుతారని తెలిసింది. దీంతో ఆ అరెస్ట్ కానీ, ఈ వ్యవహారం తన దాకా రాకుండా ఉండేందుకు ముందస్తుగా తమ్ముడిని పక్కన పెట్టేసారని
తెలియవచ్చింది. దీంతో పాటు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గడుకోట శ్రీకాంత్ రెడ్డిని తప్పించి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఇంచార్జిగా నియమించడం జరిగింది. ఇక ఇప్పటి వరకూ జడ్పీటీసీగా ఆకేపాటి స్థానాన్ని మరొకరికి ఇవ్వడం జరిగింది. దీంతో సొంత ఇలాకాలో అన్నీ జగన్ సెట్ చేశారని చెప్పుకోవచ్చు. కడపతో మొదలైన ప్రక్షాళన ఎక్కడ ఆగుతుంది..? జగన్ చేసిన ఈ ప్రయోగం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలసిందే మరి.