ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. సేనాని ఇలా మారిపోయారు ఏంటి..? అధికారంలో లేనప్పుడు ఒకలా..? అధికారంలో ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తించడం ఏంటి..? అని జనాలు తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఈ మాటలు అన్నది పవనేనా కదా అని ఒకటికి పదిసార్లు సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులు క్రాస్ చెక్ చేసుకుంటున్న పరిస్థితి. తీరా చూస్తే వైసీపీ శ్రేణులు, విమర్శకులను తిట్టి పోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది..? పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జగన్ ఫ్యాన్స్ మధ్య ఎందుకు ఇంత రచ్చ జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం రండి..!
ఇదీ అసలు కథ..!
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో ఏపీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకూ 18 మంది చనిపోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో షిఫ్ట్‌లో దాదాపు 380 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన, మృతి చెందిన కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా మీట్ పెట్టారు. ఆయన ఏమైతే మాట్లాడాలని అనుకున్నారో అవి మాట్లాడి సైలెంట్ అయ్యి ఉండుంటే ప్రశాంతంగా ఉండేదేమో..! కానీ ఏదో మాట్లాడబోయి.. ఇంకేదో మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు.
ఏం జరిగింది..?
జనాలు, కార్మికుల ప్రాణాలు పోకూడదనే పరిస్థితిలో ఎప్పుడు ఉంటాను.. అలాంటిది సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయి అనే వదంతు ఉందని పవన్ కళ్యాణ్ సెలవు ఇచ్చారు. ఇక్కడే డిప్యూటీ సీఎం పప్పులో కాలేసారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే పెద్ద మనిషి వైసీపీ అధికారంలో ఉండగా.. ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ జరగ్గా ఊగిపోయి మాట్లాడి, ప్రభుత్వం ఏం గడ్డి పీకుతోందా అని రెచ్చిపోయి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడటం ఏంటి..? అని వైసీపీ మండిపడుతోంది. దీనిపై చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు, వైసీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది.. డిప్యూటీనీ గట్టిగానే ఆడుకుంటోంది. ఐతే.. ఇందుకు జనసేన, టీడీపీ పార్టీ శ్రేణులు స్పందిస్తూ వీడియో సగం సగం వింటే ఇలానే ఉంటుంది.. పూర్తిగా చూడండిరా బాబూ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సంతాపం ప్రకటించడం, ఎక్స్ గ్రేషియా ఇవ్వడం కాదు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన ఆవశ్యకత వుందని కచ్చితంగా ఈ విషయంలో ముందుకెళ్తామని పవన్ చెప్పిన మాటలను కట్ చేసి మరీ.. కౌంటర్ ఇస్తున్న పరిస్థితి.
జగన్ రంగంలోకి దిగాక..!
ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. తొలుత మృతులకు సంతాపం తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల వరకూ ఇవ్వాలని.. అలాగే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఫార్మా సెజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారని వైసీపీ చెప్పుకుంటోంది. మరోవైపు.. అనకాపల్లి జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి బాధితులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఐతే.. నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో అప్పటి జగన్ ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు మృతుల కుటుంబాలకు ఇచ్చిందని.. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం అదే తరహాలో నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్ రావడంతో కోటి రూపాయలు చెక్కులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని గట్టిగానే టాక్ నడుస్తోంది. చూశారుగా అటు ఉప ముఖ్యమంత్రి మాటలు.. ఇటు వైసీపీ డిమాండ్ తర్వాత పరిస్థితి ఎలా మారిందో..!!