ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడిందే ఆట.. పాడిందే పాట..! ప్రజావేదికతో మొదలైన కూల్చివేతలు ఎక్కడిదాకా వెళ్ళాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా విగ్రహాలు, పథకాల పేర్లు.. యూనివర్శిటీల పేర్లు ఇలా ఏదీ వదలకుండా మార్చేశారు. ఇదే వైఎస్ జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని సొంత పార్టీ నేతలే చెప్పిన మాటలు చాలానే విన్నాం. ఆఖరికి ఇదే మార్పును ప్రజలు కోరుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇదంతా ఇప్పటి ప్రభుత్వానికి.. ఇతర రాష్ట్రాలకు గుణపాఠం కావాలి.. చూసి ఇలాంటివి చేయకుండా ఉండాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అచ్చు గుద్దినట్టుగా అవే పనులు చేస్తుంటే ఎలా ఉంటుంది..? అనేది ఒకసారి ఊహించుకుంటేనే కాంగ్రెస్ శ్రేణులు భయపడుతున్న పరిస్థితి.
తెలుసుకోవాలిగా..!
ఇక తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తక్కువేమీ చేయలేదు. అధికారంలో ఉన్నన్ని రోజుకు కేసీఆర్ మోనార్క్ కంటే దారుణంగా ప్రవర్తించారని ఆరోపణలు లేకపోలేదు. అందుకే హ్యాట్రిక్ సీఎం అనుకున్న గులాబి బాస్ అడ్రెస్స్ లేకుండా పోయింది. అటు జగన్ కూడా ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు ఇంకో పదేళ్లు, ఇరవై ఏళ్ళు, ముప్పై ఏళ్లు అని పెద్ద పెద్ద లెక్కలే వేసుకుంది వైసీపీ.. కానీ పట్టుమని ఐదేళ్లకు పరిమితం చేసిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశారు. అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి నుంచీ చాలానే తెలుసుకోవాలి.. ఆ అవసరం కూడా ఎంతో ఉంది.
ఇంకా ఎన్నాళ్ళు ఇలా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తూనే వస్తోంది. కరెంటు కోతలు, నీటి సమస్యలు , రైతన్నల ఆవేదనలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయ్.. ఇవన్నీ నిజమే అని కూడా రేవంత్ సర్కార్ తెలుసుకున్నది కూడా..! ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద వివాదమే నడుస్తోంది. అసలు ఎందుకు ఈ ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చిందో ఏంటో అర్థం కావటం లేదు. ఆయనకు తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా..? పోనీ ఆ విగ్రహం పెడితే ఏమైనా రాష్ట్రానికి ఒరిగేది ఉందా..? అంటే అబ్బే పైసా కూడా ప్రయోజనం లేదు.
బీఆర్ఎస్ ఏమంటోంది..?
సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి.. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని ఒక్కరంటే ఒక్కరూ అంగీకరించడం లేదు. ఒకింత కాంగ్రెస్ నేతల నుంచి కూడా సపోర్టు రావటడం లేదని లోలోపల టాక్. ఐతే.. మూడోసారి అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి స్థలాన్ని కూడా నాటి ప్రభుత్వం కేటాయించింది. కానీ.. ప్రభుత్వం మారిపోవడంతో అదేమీ జరగలేదు. ఇలా ఒక్కటే కాదు రేవంత్ తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజానీకం, మేధావులు అంగీకరించడం లేదు. నాడు కేసీఆర్, జగన్ రెడ్డి తీసుకున్న తుగ్లక్, మోనార్క్ నిర్ణయాలకు ఫలితం ఏంటి అనేది కళ్ళారా చూసినా కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఎందుకిలా చేస్తున్నారు అని సొంత పార్టీ, అభిమానుల నుంచి పెద్ద ఎత్తునే ప్రశ్నలు, వ్యతిరేకత గట్టిగానే వస్తోంది. అందుకే ఇకనైనా.. కాస్త తెలివిగా, తెలుసుకొని అనవసరపు పనుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.. మరో ఐదేళ్లు కంటిన్యూ అవ్వొచ్చు.. లేనిచో జగన్, కేసీఆర్ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..!