కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ దళపతి.. తమిళగ వెట్రి కళగం పొలిటికల్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉండగా.. మధ్యలో రౌండ్ సింబల్.. ఈ గుర్తుకు అటు, ఇటు ఏనుగులు ఉన్నాయి. దీంతో పాటు పార్టీ యాంథంను కూడా రిలీజ్ చేశారు విజయ్. పార్టీ లక్ష్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇదిలా ఉంటే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దళపతి తన దళాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ పేరు వెనుక..?
ఇదిలా ఉంటే.. పార్టీ పేరు వెనుక తమిళనాడు సెంటిమెంట్ వచ్చేలా గట్టిగానే ప్లాన్ చేసారు విజయ్. తమిళ వెట్రి కళగం.. అంటే తమిళనాడు సక్సెస్ పార్టీ. వెట్రి అంటే విజయం.. కళగం అంటే పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాట జరిగిన లోక్ సభ ఎన్నికల ముందే పార్టీని ప్రారంభించినా.. ఇప్పటికిప్పుడు పోటీ చేయనని.. టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలు అని తేల్చి చెప్పేశారు. అదే రోజున.. త్వరలోనే జెండా.. ఎజెండా ప్రకటిస్తానని చెప్పిన విజయ్.. ఆగస్టు 22న కీలక ప్రకటన చేశారు.
వర్కవుట్ అవుతుందా..?
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉండగా.. అన్నాడీఎంకే ప్రతిపక్షంగా ఉంది. ఐతే.. అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత పార్టీ పార్టీగా లేదు. ఒకవైపు శశికళ, ఇంకోవైపు పన్నీర్ సెల్వం.. మరోవైపు పళనిస్వామి గొడవలు పడుతూనే ఉన్నారు. దీనికి తోడు బీజేపీ సైతం బరిలోకి దిగి.. అన్నాడీఎంకే క్యాడర్ ని మొత్తం లాక్కునే పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం స్టాలిన్‌కు దీటుగా సరైన నాయకుడిగా ఇంకెవరూ లేరనే చెప్పుకోవచ్చు. ఇక శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో కలిపేయగా.. మిగిలింది కమల్ హాసన్ పార్టీ మాత్రమే.. ఈయన పార్టీ పెట్టీ ఏళ్లు గడుస్తున్నా ఆశించినంతగా ఫలితం రాలేదు.. ఒక్కటీ గెలిచిన దాఖలాలు లేవు. ఐతే బీజేపీపై గట్టిగానే విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడంతో.. స్టాలిన్ - విజయ్ మధ్యే గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ట్రస్ట్ ద్వారా జనాల్లోకి బాగా వెళ్ళడం, సామజిక సేవలో ముందు వరుసలో ఉండటం, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ విజయ్ పార్టీకి కలిసొచ్చే అసలు అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ దళపతి..!!