అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పూటకో ట్విస్ట్.. రోజుకో సంచలన విషయం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో తాజాగా.. దివ్వెల మాధురీ సంచలన ప్రకటనే చేశారు. దువ్వాడ వాణి మాటల తూటాలు, ఆరోపణలు.. ఆత్మహత్యాయత్నం.. చర్చలు ఇలా అన్ని విషయాలపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఒక్క వీడియో యవ్వారం మొత్తం మొదటికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు.
ఏం జరిగింది..?
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన దివ్వెల మాధురి.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇప్పటి వరకూ తన భర్త తనకు కావాలని.. ఇల్లు, రాజకీయంగా అన్నీ తనకే కావాలని చెబుతూ కామెంట్స్ చేసిన వాణి.. దువ్వాడకు ప్రాణహాని కూడా ఉందని చెప్పడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై మాధురి వీడియో రూపంలో మాట్లాడుతూ.. ఒకవేళ తన వల్ల ప్రాణహాని ఉంటే రెండేళ్ల నుంచి దువ్వాడ శ్రీనివాస్ బాగోగులు ఎలా చూసుకుంటాను..? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా లేని అపాయం ఇప్పుడు ఎలా వచ్చింది..? నేను దువ్వాడతో ఉంటున్నాననే నిరసన మొదలుపెట్టింది వాణీనే కదా..?. దువ్వాడను చంపడానికి ప్రయత్నించింది వాణి కాదా..? 10 మందిని తీసుకొచ్చి తలుపులు ఎందుకు పగులగొట్టారు..? ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసు..? అని మాధురి వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై దువ్వాడ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఇదీ ట్విస్ట్ అంటే..?
దువ్వాడ ఎపిసోడ్ మొత్తం మీద హైలైట్‌గా నిలిచింది.. కొత్త ఇంటి వ్యవహారమే. ఈ ఇల్లు తనకు కావాలని వాణి చెబుతుండగా.. బాబోయ్ దానికి ఇంకా 60 లక్షల రూపాయిలు పెండింగ్‌లో ఉన్నాయని భూమి అమ్మిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మాధురి బాంబ్ పేల్చారు. ఇంటి నిర్మాణంలో తాను రెండు కోట్ల రూపాయలు పెట్టానని చెప్పుకొచ్చారు. అయినా తాను డబ్బులు ఆశించలేదని.. ఇల్లు కావాలంటున్న వాణికి ఎంత హక్కు ఉందో.. తనకు కూడా అంతే హక్కు ఉందన్నారు. రెండు కోట్ల రూపాయలు తనకు వాణి ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కాదంటే శ్రీనివాస్ కట్టిన రూ.6 కోట్ల సొంత ఇంటికి వెళ్లిపోయి అక్కడికే ఆయనను తీసుకెళ్లి తేల్చుకుంటుందో వాణి ఇష్టమన్నారు. దువ్వాడ ఇంటి దగ్గర ధర్నాను కొనసాగిస్తే తాను కూడా తన డబ్బుల కోసం అక్కడే నిరసనకు దిగుతానని తేల్చి చెప్పేశారు మాధురి. ఈ వ్యాఖ్యలపై దువ్వాడ వాణి ఎలా రియాక్ట్ అవుతుంది..? అనేది చూడాలి.