సీఎం, డిప్యూటీ గ్రీన్ సిగ్నల్.. నాగబాబుకు కీ పోస్ట్!
అవును.. మెగాబ్రదర్ నాగబాబును పవన్ కల్యాణ్ కీలక పదవిలో కూర్చోబెట్టబోతున్నారు..! ఇప్పుడిదే.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. అటు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. ఇంతకీ ఆ కీలక పదవి ఏంటి..? సినిమాలు, రాజకీయాలకు రెండింటింకీ సంబంధముండే ఆ పదవి ఏంటబ్బా..? తమ్ముడు ఇస్తున్న ఈ పదవిపై అన్న రెస్పాన్స్ ఎలా ఉంది..? ఇప్పటికే టీటీడీ చైర్మన్ అని ఓ రేంజిలో ఊదరగొట్టిన మీడియా, సోషల్ మీడియా.. లేటెస్ట్‌గా వస్తున్న ప్రచారంలో నిజమెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
ఒకరికొకరు..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతలా శ్రమించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు కూటమికి బీజం పడింది మొలుకుని.. ఢిల్లీ వేదికగా చక్రం తిప్పడం.. ఇలా గెలుపు వరకూ ప్రధాన పాత్రే పోషించారు పవన్. రాష్ట్రం మొత్తం సేనాని చూసుకుంటే.. తమ్ముడి గెలుపుకోసం తాను పోటీ చేయకుండానే పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అంతేకాదు.. 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడేం చిన్నపాటి విబేధాలు వచ్చినా సరే నిమిషాల్లో వాలిపోయి పరిష్కరించి ముందుకు తీసుకెళ్లారు మెగా బ్రదర్. తమ్ముడు కూటమి గెలుపులో.. అన్న జనసేన 100 స్ట్రైక్ రేటులో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇలా పార్టీకి అన్నీ తానై గెలిపించిన అన్నను మంచి పదవిలో కూర్చోబెట్టాలని పవన్ అనుకుంటున్నారట.
మెచ్చినదేనా..?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడిక ఆయనకంటూ ఓ పదవి ఉండాలని భావించిన తమ్ముడు.. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టబోతున్నారట. ఎందుకంటే.. సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన నుంచే ఉన్నారు.. ఇక ఈ కార్పొరేషన్ కూడా ఇదే పార్టీ నుంచి ఉంటే బాగుంటుందని.. పైగా సినిమా ఇండస్ట్రీకి దగ్గర మనిషి, కావాల్సిన మనిషి కావడంతో నాగబాబుకు ఇవ్వాలని సీఎంను కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో మెగా బ్రదర్స్ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతున్నారట. వాస్తవానికి టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకే దక్కబోతోందని అప్పట్లో పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది.. అయితే అదంతా అబద్ధమే అని తేలింది. ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ అని కూడా వార్తలు రాగా అబ్బే అదీ అవాస్తవమే కొట్టి పారేసింది జనసేన. తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే.. నామినేటెడ్ పదవుల పంపకం వరకూ వేచి చూడాల్సిందే మరి.