పెదవి దాటి మాట వచ్చిందంటే తిరిగి తీసుకోవడం కష్టం.. అవును పొరపాటే అని క్షమాపణ చెప్పినా అస్సలు అవ్వదు..! అందుకే ఆచి తూచి మరీ మాట్లాడితే మంచిదని పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, మీడియానే కదా అని ఏది పడితే అది మాట్లాడితే రేపొద్దున్న పరిస్థితులను మనం ఊహించలేనంతగా ఉంటాయ్..! సరిగ్గా ఇప్పుడు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇదే చేశారు. ఈయన మాటలు విన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు యోవ్.. ఏందయ్యా ఇది అంత మాట అనేశావ్ అని కొందరు అంటుంటే.. వామ్మో వాసం దెబ్బకు కూసాలు కదిలిపోయాయ్ అని మరికొందరు చెబుతున్న పరిస్థితి.
ఇంతకీ ఏమన్నారు..?
వాసంశెట్టి సుభాష్.. రామచంద్రాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి దక్కించుకున్న నేత. కార్మిక శాఖా మంత్రి అయిన వాసం.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవడానికి నిత్యం ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ నలుగురి నోళ్లలో నానాలని చూస్తుంటారు. అయితే.. తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంత్రి.. ప్రిపరేషన్ సరిగ్గా లేదో లేకుంటే స్క్రిప్ట్ తప్పుగా తెలియట్లేదు కానీ తప్పులో కాలేశారు. ఇప్పుడీ తప్పును పట్టుకుని వైసీపీ, నెటిజన్లు బంతాట ఆడుకుంటున్నారు. చంద్రన్న బీమా పథకంలో కోట్లలో అవినీతి జరిగింది.. ఇదే ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్. వైఎస్సార్ బీమా పథకం అని మాట్లాడబోయిన మంత్రి.. వైఎస్సార్ స్థానంలో చంద్రన్నను తెచ్చేశారు. దీంతో వాసం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాసం మాటలను బట్టి చూస్తే.. గత నారా చంద్రబాబు ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఒప్పుకున్నారేమో వాసం.
చూసుకోబల్లే..!
వైసీపీ హయాంలో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రూ.5 లక్షల వరకు బెనిఫిట్ ఉండేది. అయితే.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పేరు మార్చేయడం జరిగింది. దీంతో వైఎస్సార్ బీమా అనబోయిన వాసం చంద్రన్న అని ఒక్కసారిగా కూటమి సర్కార్ కూసాలు కదిలించేలా మాట్లాడేశారు. దీంతో.. ఓరి బాబోయ్ ఆయన్ను కాస్త మీడియాకు దూరంగా అయినా ఉండమని చెప్పండని సొంత పార్టీ నేతలే సూచిస్తున్న పరిస్థితి. అసలే సోషల్ మీడియా విపరీతంగా వాడుతున్న కాలం.. దీనికి తోడు ఎవరేం తప్పుగా మాట్లాడుతారా పట్టేద్దామా అని బావురు కప్పలాగా వైసీపీ ఎదురుచూపుల్లో ఉందన్న విషయాన్ని తెలుసుకుని మీడియా ముందుకు వస్తే అదే పదివేలు సుభాష్..!