పీఆర్.. పబ్లిక్ రిలేషన్స్.. అదేనబ్బా ప్రజా సంబంధాలు అంటారు కదా అదే..! ప్రభుత్వానికి ప్రజలకు.. పార్టీకి ప్రజలకు ఎలాంటి సమాచారం బయటికి రావాలన్నా ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి జనాలకు తెలియజేయడానికి ఈ పీఆర్‌దే ప్రధాన పాత్ర. దీనికంటూ ప్రతి రాజకీయ పార్టీలో.. ప్రభుత్వంలో ఓ టీమ్ అనేది ఉంటుంది. పొరపాటున కాస్త అటు ఇటు అయ్యిందంటే అసలుకే ఎసరు వస్తుంది..! అందుకే ఆచి తూచి కాదు కదా అంతకుమించి ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి మరీ స్టెప్ ముందుకు వెయ్యాలి..! ఇక అసలు విషయానికొస్తే.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్‌లో చెప్పిన పథకాలు ఒక్కొక్కటి అమలు చేయడానికి భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. అవి ఎప్పుడు అమలు అవుతాయో తెలియట్లేదు కానీ.. తాజాగా అన్న క్యాంటిన్లు ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబును ఎంతలా మెచ్చుకున్నారో అంతకుమించి తిట్టుకున్నారు కూడా.. ఎందుకు ఏమైందనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఎందుకీ పీఆర్ స్టంట్లు!
సోషల్ మీడియా విస్తృతి అనేది విపరీతంగా పెరిగిపోవడంతో పేపర్‌లో చదివో, టీవీలలో వార్తలు చూసో ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకునే రోజులు కావు. ప్రతి క్షణం స్మార్ట్ ఫోన్ ద్వారా సమాజంలో ఎప్పటికప్పుడు ఏం జరిగింది..? అనేది తెలుసుకునే రోజులు ఇవి. అందుకే రాజకీయ పార్టీలు.. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒకవేళ పీఆర్ జోలికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదు లేనిపోని పీఆర్ స్టంట్లతో ఆగమైపోతుంది అంతే..!గుడివాడలో అన్న క్యాంటిన్లు ప్రారంభించిన తర్వాత ఓ యువకుడు మాట్లాడుతూ సార్.. ఐదేళ్లు చాలా ఇబ్బందిగా గడిపాం.. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పాడు. అయితే అసలు ఎవరా వ్యక్తి..? ఏమిటా కథ..? అని ఆరా తీసి నిమిషాల్లోనే బాగోతం బయటపెట్టేసింది వైసీపీ, నెటిజన్లు. దీంతో.. ఓ వీడియోను తయారు చేసి మరీ కూటమి ప్రభుత్వాన్ని బంతాట ఆడుకుంది బులుగు పార్టీ. ఓవర్ యాక్షన్ చేయడం.. వెంటనే దొరికిపోవడం టీడీపీకి అలవాటైపోయిందని.. అన్న క్యాంటీన్ లేక ఐదేళ్లు పస్తులున్నట్లు చంద్రబాబుతో కలిసి భోజనం చేస్తూ.. సామాన్యుడిలా ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి పేరు వంశీ. అతను టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు. ఇదిగో కేఎఫ్‌సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫొటోలు, ఎన్నికలకు ముందు అతను చేసిన హడావుడి వీడియోలు వెలుగులోకి అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఆర్టిస్ట్‌తో డ్రామా రక్తి కట్టించినా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అంటూ గట్టిగానే ఆటాడేసుకుంది వైసీపీ.
బాబు ఇలా.. చినబాబు అలా..!
అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు రెండంటే రెండు స్పూన్లు మాత్రమే అన్నం తిన్నారు. చినబాబు లోకేష్ క్యూలైన్‌లో నిల్చుని మరీ పావు ముక్క ఇడ్లీతో సరిపెట్టడం గమనార్హం. అసలు ఎవరు చేయమన్నారు ఇదంతా..? ప్రారంభం అయ్యిందా..? అక్కడ్నుంచి వెళ్లిపోయామా..? అని ఉంటే బాగుండేది కదా..? అనవసరంగా బుక్కవ్వడం ఎందుకు..? అని సొంత పార్టీలోని కొందరు నేతలు, కార్యకర్తల ద్వారా వస్తున్న విమర్శలు. సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకున్న వైసీపీ.. ఇక చూస్కోండి ఆడేసుకుంది. అయ్యా రెండు స్పూన్లు.. కొడుకు పావు ముక్క ఇడ్లీ తినడం ఏదైతే ఉందో నభూతో నభవిష్యతి. ఎందుకంటే.. అది పేదలకు పెట్టే ఆహారం. పైగా ఐదు రూపాయలకు పెడుతున్న ఆహారం. ఆకలి తీర్చే ఆహారాన్ని తక్కువ చేయడం కాదు కానీ.. తమ ప్రభుత్వం పెడుతున్న భోజనం మీద ఈ తండ్రీ కొడుకులకు ఎంత నమ్మకం ఉందో చూడండి.. కనీసం ప్రారంభోత్సవం రోజున కూడా పేదవాళ్లతో కలిసి ధైర్యంగా నాలుగు ముద్దలు తినలేక పెదబాబు.. ధీమాగా ఒక ఇడ్లీ నోట్లో పెట్టుకోలేక చినబాబు ఆపసోపాలు పడ్డారు. వాళ్లు పెడుతున్న ఆహారంపై వాళ్లకు ఉన్న అపనమ్మకమో, లేక బాబు వెన్నుపోటు పొడిచిన అన్నగారు గుర్తొచ్చి ముద్ద గొంతు దిగలేదో మరి!. అయినా ప్రజలతో కలిసిపోవడం, వాళ్లు తినే అన్నం ముద్దను వాళ్లతోనే కలిసి పంచుకోవడం అంటే ఫొటోలు దిగినంత ఈజీనా.. అది ప్రజలను మన అనుకున్నవాళ్లకే సాధ్యం.. అని ఈ పీఆర్ స్టంట్‌పై వైసీపీ గట్టిగానే ఆడుకుంది.
అయినా.. ఇవన్నీ అవసరమా..?
ఈ పీఆర్ స్టంట్లపై ఒక్క వైసీపీనే కాదు.. నెటిజన్లు, సొంత పార్టీ కార్యకర్తలు, మేథావులు సైతం గట్టిగానే స్పందిస్తున్నారు. అయినా ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలే సోషల్ మీడియా కాలం అన్న విషయం మరిచిపోతే ఎలాగా..? ప్రతిసారీ పీఆర్, మీడియానే నమ్ముకుంటే అచ్చు తప్పే అవుతుందన్నది సీబీఎన్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఒకవేళ ఇదంతా చంద్రబాబుకు తెలియకుండానే జరిగి ఉంటే మాత్రం వెంటనే ఆ పీఆర్ టీమ్ ఏదైతే ఉందో.. రాజకీయ వ్యూహకర్తలను మార్చుకుంటే మంచిదన్నది తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్న ఓ పెద్ద సలహా. ఇక చంద్రబాబు, లోకేష్ విషయానికొస్తే.. ఓపెనింగ్‌కు వచ్చారు సరే తినాలని లేనప్పుడు సైలెంట్‌గా వెళ్లిపోయి ఉంటే ఎవరేం క్వశ్చన్ చేసేవాళ్లు కాదు కదా..? అలాంటిది పావు ఇడ్లీ, రెండు చెంచాల అన్నం తినడమేంటి..? ఒకవేళ నిజంగా టేస్టీగానే ఉంటుంది అనుకుంటే ఇంకో రెండు ముద్దలు లాంగించేసి ఉంటే సరిపోయేది కదా..? అలా టేస్ట్ చేసి.. ఇలా అనవసరంగా బుక్కవ్వడం ఎందుకు..? ఇప్పటికైతే జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా కాస్త ఆ పీఆర్ టీమ్‌తో, మరీ ముఖ్యంగా ఈ పీఆర్ స్టంట్లతో జరజాగ్రత్తగా ఉంటే మంచిది సీబీఎన్..!