దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిస్థితేంటి..? తర్వాత ఏం జరగబోతోంది..? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా ఎపిసోడ్‌తో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇదే. కన్నడనాట డీకే ఉన్నారు..? మరి తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నదెవరు..? అసలేంటీ కర్ణాటక ఘటన..? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే ఎందుకీ చర్చ..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు కథ..!
ముడా.. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కర్నాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17, భారత నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్- 218 కింద ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే తదుపరి సీఎం అయ్యేదెవరు..? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. అయితే.. డీకే శివకుమార్ సీఎం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారని కన్నడ మీడియా వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌కు ఆర్టీఐ కార్యకర్త చేసిన ఒకే ఒక్క ఫిర్యాదు ఈ పరిస్థితి తెచ్చింది. కాగా.. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సీఎంను విచారణకు రమ్మనడం తప్పని.. వెంటనే గవర్నర్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి వర్గం డిమాండ్ చేస్తోంది.
తెలంగాణలో ఇలా..!
ఒక అవినీతి కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా ప్రమాద ఘంటికలు మోగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. రేవంత్ ఓటుకు నోటు కేసులో కూడా సుప్రీం కోర్టులో విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఒకవేళ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందిగా తీర్పు వస్తే పరిస్థితేంటి..? ఇక్కడ ఎవరిని సీఎం చేయాలి..? డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతారా లేకుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా..? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభం అయ్యింది. కర్ణాటకలో ఉన్న ట్రబుల్ షూటర్ డీకే లాగా తెలంగాణలో ఎవరున్నారు..? అంతటి చాణక్యత ఎవరికి ఉంది..? పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునే నేత ఎవరు..? అంటూ జోరుగానే చర్చ సాగుతోంది. అయినా.. ఎక్కడో కర్ణాటకలో అలా జరిగితే.. ఇక్కడ కూడా అలా జరగదనీ లేదు.. కచ్చితంగా జరుగుతుందని కూడా లేదు. అయినా గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్రం చేతిలో ఉంటుంది కదా.. ఏమైనా జరగొచ్చు సుమీ..!