ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిచిన తర్వాత.. రోజూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వస్తూనే ఉంది..! ఇప్పటికే సూపర్ సిక్స్‌తో పాటు పలు విషయాలపై రచ్చ రచ్చ జరుగుతున్న తరుణంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చంది..! అదేమిటంటే.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు మంత్రులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిఘా పెట్టారనే సమాచారం. దీంతో అవునా.. నిఘా ఎందుకు..? ఇంతకీ ఎవరా మంత్రులు..? ఎందుకు ఇంతలా నిఘా పెట్టాల్సి వచ్చింది..? కొంపదీసి వాళ్లేమైనా తప్పులు చేస్తున్నారని.. ఇలా చేస్తున్నారా..? అనే అనుమానాలు జనాలకు, ఆయా పార్టీ శ్రేణులకు వస్తున్నాయ్.
ఎవరూ ఏడుగురు..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి జూనియర్ మంత్రులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందోని.. ఎప్పటికప్పుడు ఈ ఏడుగురికి సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబు తెప్పించుకుని చూస్తున్నారట. వీరంతా తొలిసారి మంత్రి పదవులు పొందిన వారే కావడం గమనార్హం. ఈ మంత్రులకు పదవులు కొత్త కావడం, శాఖపై అనుభవం లేకపోవడంతో పట్టు సాధించే వరకూ సలహాలు, సూచనలు ఇవ్వడం.. ఆయా శాఖల పరిధిలో ఏం జరుగుతోంది..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు..? సంబంధిత శాఖా అధికారులతో ఎలా ఉంటున్నారు..? అనేదానిపై కొందరు ఐఏఎస్‌ల ద్వారా చంద్రబాబు నిఘా పెట్టారన్నది టాక్.
నేనున్నా.. ధైర్యంగా పదండి!
అయితే ఈ నిఘా అంతా.. ఆ ఏడుగురు మంత్రులు ఏదో చేసేస్తారని కానీ, అవినీతికి పాల్పడుతున్నట్లు మాత్రం అస్సలు కాదట. తొలిసారి పదవులు రావడం, అనుభవం లేకపోవడంతో మాత్రమే నిఘా పెట్టారట. అయితే ఇదంతా ఆ మంత్రులకు తెలియకుండానే నడుస్తోందన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకొని అవసరమైతే అధికారులను అడిగి తెలుసుకోవడం, కొన్ని సందర్భాల్లో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి మార్గదర్శకాలు ఇస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆ ఏడుగురు మంత్రులు జాగ్రత్తగా ఉంటే మంచిది సుమీ..!