ప్రస్తుతం ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్ట్రేలియాతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు కుటుంబ సమేతంగా వెళ్లిన రామ్ చరణ్.. ఈ అంతర్జాతీయ వేదికపై ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారాన్ని అందుకుని అరుదైన గౌరవాన్ని పొందారు. అలాగే మెల్‌బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్‌లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని.. ఇండియన్ ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు.
ఇక ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో తనకు మంచి మెమరీస్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. 14 సంవత్సరాల క్రితం నా మూడో సినిమా ఆరెంజ్ షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వచ్చాను. ఆ సినిమా 30 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుపుకుంది. షూటింగ్ పూర్తయి వెళ్లేటప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. ఇక్కడి ప్రజలు నాపై అంత ప్రేమను కురిపించారు. ఇప్పుడింకా ఎక్కువగా ఇక్కడ భారతీయులు ఉన్నారని అనిపిస్తోంది. నిజంగా నా హోమ్ టౌన్‌లో ఉన్న ఫీలింగ్ ఉంది. ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడుండే ఇండియన్స్ వల్లే అది సాధ్యమైందని చెప్పిన చరణ్.. ఈ వేదికను, వేడుకను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ స్పీచ్ వీడియోలు, ఫ్లాగ్ ఆవిష్కరణ ఫొటోలు, పురస్కారం అందుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను వైరల్ చేస్తూ.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ రేంజ్ ఇదంటూ ఫ్యాన్స్ చేసే హంగామాతో రామ్ చరణ్ పేరు రెండు రోజులుగా టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.