తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటుదామని పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీ బలపడుతోందా..? రానున్నవన్నీ గులాబీ పార్టీకి మంచి రోజులేనా..? పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన గులాబీ బాస్ కానీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అస్సలు చేయకుండానే గ్రాఫ్ పెరుగుతోందా..? అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ రెండు పార్టీలు గట్టిగానే బీఆర్ఎస్‌ను లేపుతున్నాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ ఓడిపోయిన పార్టీని జాతీయ పార్టీలు ఎందుకింత సీరియస్‌గా తీసుకున్నాయ్..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!
ఇదీ అసలు సంగతి..!
అటు.. ఇటు అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయి గెలిచిన కాస్తో కూస్తో ఎమ్మెల్యేలను కూడా పోగొట్టుకుని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. రానున్న లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు గులాబీ నేతలు. అయితే.. పెద్దల ప్రమేయం లేకుండానే పార్టీ పేరు జనాల్లోకి వెళ్లిపోతోంది.. గంటకొకరు, పూటకొకరు బీఆర్ఎస్ గురించి ప్రత్యర్థులు మాట్లాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ మాట్లాడితే బీజేపీ.. బీజేపీ మాట్లాడితే తిరిగి కాంగ్రెస్ మాట్లాడుతూ జనాల్లోకి తెగ తీసుకెళ్లిపోతున్నారు. దీంతో నిత్యం జనాల నోళ్లలో మెదులుతూనే ఉంది కారు పార్టీ. దీనికి తోడు అదేదో అంటారో ఇద్దరు బలవంతులు, బలహీనుడి మీద పడితే ఒకసారి కాకపోయినా ఇంకోసారికి బలపడతాడు.. తిరిగి కొట్టగలడు. ఇప్పుడు బీఆర్ఎస్‌ను బలమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓ రేంజిలో ఎటాక్ చేస్తూనే ఉన్నాయి.
ఎవ్వరూ తగ్గట్లేదుగా!
అసలు సంబంధం లేని విషయాల్లోకి బీఆర్ఎస్‌ను లాగి కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందన్నది గులాబీ నేతల ఆవేదన. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారని.. హరీష్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్షనేత, కవితకు రాజ్యసభ సీటు దక్కుతుందని జోస్యం చెప్పారు. అబ్బే ఇదంతా అచ్చు తప్పు.. త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమని బీజేపీ చెబుతోంది. కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయమని జోస్యం చెబుతోంది కాషాయ పార్టీ. చూశారు కదా.. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏ రేంజిలో బీఆర్ఎస్‌ను లేపుతున్నాయో..! ఈ మాటలకు ఏమైనా అర్థముందా..? అనేది ఆ పార్టీల పెద్దలకే తెలియాలి. సో.. అటు జనాల్లో, ఇటు మీడియాలో గట్టిగానే బీఆర్ఎస్‌కు పబ్లిసిటీ ఇస్తూ.. కారును కూడా రిపేర్ చేసేస్తున్నారు మరి.