Advertisement
TDP Ads

రంగనాథ్ రెడీ.. రేవంత్ ఏమంటారో!?

Sat 17th Aug 2024 05:13 PM
revanth reddy,hydra,ranganath  రంగనాథ్ రెడీ.. రేవంత్ ఏమంటారో!?
Ranganath Ready.. What about Revanth Reddy? రంగనాథ్ రెడీ.. రేవంత్ ఏమంటారో!?
Advertisement

హైడ్రా.. ఇప్పుడీ మాట వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్! ఇక దీన్ని మెయింటైన్ చేసే హెడ్ పేరు చెబితే అబ్బో ఇక అదో పెద్ద కథే..! సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈయనంటే దడుసుకుంటున్న పరిస్థితి. హైడ్రా.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన సరికొత్త సంస్థే ఇది. ఇంతకీ ఏమిటీ హైడ్రా..? ఎవరా హెడ్..? ఏమిటా కథా కామిషు అనేది చూసేద్దాం వచ్చేయండి..!

అట్లుంటది మరి..!

హైదరాబాద్‌లో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ప్రైవేట్ వ్యక్తులదా..? ప్రభుత్వానికి సంబంధించినదా అని మారుమాట కూడా ఆలోచించకుండా కబ్జా దారులు కాటేస్తుంటారు..! ఇక చెరువులు, గుట్టలపై కన్ను పడిందంటే రాత్రికి రాత్రే మాయం అయిపోతుంటాయ్..! ఇందుకే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసి.. అక్రమార్కుల అంతు చూడటానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ తెచ్చినదే హైడ్రా. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో భాగ్యనగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్థకు కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ను సర్కార్ నియమించింది. రంగనాథ్ ఎంత స్ట్రిక్ట్‌ ఆఫీసర్ అనే విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. సరిగ్గా ఆయన చేతిలో ఈ డిపార్ట్‌మెంట్ పోయేసరికి అక్రమార్కులే కాదు.. ప్రజాప్రతినిధులు సైతం దడుసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒకచోట ఆక్రమణలను కూల్చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉందీ హైడ్రా.

తగ్గేదేలా.. ఎవ్వర్నీ వదలా!

అదేదో అంటారో ప్రజాప్రతినిధులకు అణిగిమణిగి.. చెప్పింది చేస్తేనే మంచి అధికారులు అని గుర్తింపు వస్తుందన్నది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అయితే అందరూ అలానే ఉండరు కదా.. కొందరు రంగనాథ్ లాంటి వాళ్లు కూడా ఉంటారు..! ఈయన రంగంలోకి దిగే సరికి.. కొంతమంది ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. వద్దు బాబోయ్.. ఈ సంస్థే వద్దు.. రద్దు చేయాలని డిమాండ్ సర్వత్రా వస్తోంది. అయినా సరే తగ్గేదేలా అని సీఎం రేవంత్ ఒకే ఒక్క మాట చెబితే.. ఇక అక్రమార్కుల గుండెల్లో నిద్రపోవడానికి రంగనాథ్ రెడీగానే ఉన్నారు. మరి.. ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు తలొగ్గి చూసీ చూడనట్లుగా ఉండమంటారా..? లేకుంటే బలమైన ఆదేశాలచ్చి ఇక కానివ్వు అని చెబుతారా అన్నది తెలియట్లేదు. రంగనాథ్‌ను తోటి ఐఏఎస్, ఐపీఎస్‌లు శభాష్ అని మెచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైడ్రాను బలోపేతం చేసి.. రాష్ట్రమంతా విస్తరించాలనే డిమాండ్ వస్తోంది.

నిన్న దానం.. రేపు మల్లారెడ్డి..!

హైడ్రా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 100 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగించి.. నెల వ్యవధిలోనే శభాష్ అనిపించుకుంది ఈ సంస్థ. అలాంటిది ఫుల్ పవర్స్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాతబస్తీ మొదలుకుని ఎక్కడా ఏదీ వదలకుండా రంగనాథ్ పని కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను టచ్ చేయగా ఏకంగా సీఎం దగ్గరే తేల్చుకుంటానని సవాల్ విసిరారు. బహుదూర్‌పుర ఎమ్మెల్యే మొహ్మద్‌ ముబీన్‌‌ది కూడా ఇదే పరిస్థితి. మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ ఆక్రమించిన స్థలాల్లో నిర్మించారనే ఆరోపణలు కోకొల్లలు. ఇప్పటికే అక్కడక్కడ బిల్డింగ్స్ కూల్చేశారు కూడా. రేపో మాపో మాజీ మంత్రి మల్లారెడ్డి పనిపడతారని వార్తలు గుప్పుమంటున్నాయి. హైడ్రాపై సామాన్యులు, పర్యావరణ ప్రేమికుల నుంచి సర్వత్రా ప్రశంసలు వస్తుండగా.. ప్రజాప్రతినిధుల నుంచి అంతకుమించి వ్యతిరేకత అయితే వస్తోది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు..? భాగ్యనగరాన్ని కాపాడటానికి హైడ్రా కొనసాగిస్తారా..? లేకుంటే అబ్బే అక్కర్లేదులే అని ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Ranganath Ready.. What about Revanth Reddy?:

Revanth Reddy Hydra Turns Sensation

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement