పిఠాపురం.. ఈ పేరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీ చేయకముందు ఓ లెక్క.. ఆ తర్వాత ఓ లెక్క..! 2019లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసిన పవన్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు.. దీంతో పక్కా మాస్టర్ ప్లాన్‌తో పిఠాపురం నుంచి పోటీచేసిన సేనాని 70వేల పైచిలుకు భారీ మెజార్టీ సాధించి రియల్ లైఫ్‌లో పవర్ స్టార్ అనిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం మొదలుకుని అధికారంలోకి వచ్చేంతవరకూ అహర్నిశలు కష్టపడిన పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అనుకున్నట్లే వైసీపీని అథ: పాతాళానికి తొక్కేశారు.. అధికారంలోకీ వచ్చారు. ఇక ఆయన ముందున్న టార్గెట్ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్‌తో పాటు హామీలన్నీ నెరవేర్చేలా చూడటం.. అంతకుమించి సొంత నియోజకవర్గం, జనసేనను బలోపేతం చేసుకోవడమే..!
అవునా.. నిజామా..!
ఒకటి కాదు రెండు కాదు ఐదు కీలక శాఖలు మంత్రిగా ఉన్న పవన్.. ఇప్పుడు పిఠాపురంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకాను పర్మినెంట్ చేసుకోవడానికి ఆయన తగు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. విద్యావ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని.. ఇక మెరుగైన వైద్యాన్ని కూడా ప్రజలకు అందజేయడానికి తనవంతు కృషి చేస్తున్నారట. ఈ క్రమంలోనే పిఠాపురంలో అపోలో ఆస్పత్రిని నెలకొల్పాలని.. అబ్బాయ్ రామ్ చరణ్, కోడలు ఉపాసనను డిప్యూటీ సీఎం కోరారట. ఇందుకు కావాల్సిన 10 ఎకరాల భూమిని కూడా ఇదిగో ఫలానా చోట నిర్మించండని కూడా స్థలం చూపించారట. ఇందుకు సంబంధించి చిరు, పవన్ సేవా సమితి జాతీయాధ్యక్షుడు రవణం స్వామి నాయుడు చిన్నపాటి లీకులు ఇచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్గలోకం అనేది మరెక్కడో కాదు పిఠాపురంలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
అవసరమా..?
వాస్తవానికి వైసీపీ హయాంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రులు బాగానే అభివృద్ధి చేశారు. 2019కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఎక్కడో ఒకటి అరా ఉండొచ్చు గాక..! అయితే ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసి.. సౌకర్యాలు మరింత పెంచితే బాగుంటుందన్నది ప్రధాన డిమాండ్. ఎందుకంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందరూ చికిత్స చేయించుకోలేరు.. పోనీ రాయితీలు ఇచ్చినప్పటికీ సామాన్యుడికి అతి కష్టమే. అందుకే.. ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, అవసరమైతే కొత్తగా నిర్మించినా మంచిదేనేమో అని రాజకీయ విశ్లేషకులు, మేథావులు చెబుతున్నారు. అయినా అపోలో గురించి వస్తున్న వార్తల్లో నిజానిజాలెంత అనేది తేలితే గానీ క్లారిటీ వచ్చేలా లేదు..!