శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్‌కు సంబంధించి ఒకే ఒక్క అవార్డు వచ్చింది. అది నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమాకు ఉత్తమ ప్రాంతీయం చిత్రం తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డు వరించింది. దాదాపు 20 చిత్రాలు నామినేషన్‌కు వెళితే కేవలం ఒకే ఒక్క అవార్డు రావడం పట్ల తెలుగు ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు కార్తికేయ 2 సినిమాకు అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..
ఇప్పుడే అద్భుతమైన వార్త విన్నా. కార్తికేయ 2 సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారణం, ఈ అవార్డు రావడానికి కారణం మా ఎంటైర్ టీమ్. మా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ గార్లు. అలాగే మై బ్రదర్, మై మ్యాన్ డైరెక్టర్ చందూ మొండేటి. మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, డీఓపీ కార్తీక్ ఘట్టమనేని.. ఇలా పేరుపేరునా అందరికీ థ్యాంక్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చూసిన సినిమా ఇది.
దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, చాలా మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమాను ఇంతగొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను చూసి, ఆదరించి, ఇంత ప్రేమ మాపై కురిపించారు. అలాగే నేషనల్ అవార్డు కౌన్సిల్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. అందరికీ థ్యాంక్యూ సో మచ్ అని నిఖిల్ తన సంతోషాన్ని తెలియజేశాడు.