అవును.. మీరు వింటున్నది నిజమే.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ భారతీరెడ్డి చూసుకోబోతున్నారు..! ఇప్పుడిదే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వయా బెంగళూరు మీదుగా నడుస్తున్న పెద్ద చర్చ. ఎందుకంటే.. జగన్‌కు కొడుకులు ఎవరూ లేరు.. కూతుళ్లు ఇద్దరు ఉన్నప్పటికీ వాళ్లు పెద్ద చదువుల్లో ఉన్నారు. పైగా చిన్న పిల్లలు కావడం, రాజకీయ అనుభవం లేకపోవడంతో వారి చేతుల్లో పెట్టడానికి అస్సలు అవ్వదు. పోనీ చెల్లి చేతిలో పెట్టడానికి అబ్బే.. ఉప్పు నిప్పులా ఉన్నారు. పైగా ఇద్దరి దారులూ వేరు. ఇక ఉన్నదెవరంటే సతీమణి వైఎస్ భారతీ మాత్రమే. ఇప్పటికే కాస్తో కూస్తో అనుభవం, పులివెందుల నియోజకవర్గంతో పాటు సీఎం భార్యగా రాజకీయం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూశారు గనుక.. ఆమె కోసం జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి.
అవునా.. నిజమా!
తాడేపల్లి టూ బెంగళూరు, బెంగళూరు-తాడేపల్లి పర్యటన వెనుక అసలు కథ చాలా పెద్దదే ఉన్నదట. ఇందులో ఒక పార్ట్.. భారతీ రెడ్డి రాజకీయ ప్రవేశం. స్వయంగా తానే ట్రైన్ చేస్తూ మెలకువలు అన్నీ నేర్పిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వచ్చేయచ్చన్నది వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఒకవేళ ఈ లోపు అక్రమాస్తుల కేసుల్లో లేదా.. ఏపీ ప్రభుత్వం పెట్టే కేసుల్లో అరెస్ట్ అయితే మాత్రం తప్పకుండా ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే క్యాడర్‌కు తిన్నగా లీకులు వెళ్తున్నాయట. ప్రత్యక్ష రాజకీయాలు ఎరుగని భారతి.. కడప అది కూడా పులివెందుల వరకూ మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిక రాష్ట్ర రాజకీయాలనే శాసించేలాగా.. వైసీపీని బలోపేతం చేసేలా అన్ని విధాలుగా రాజకీయ కళలు నేర్పిస్తున్నారట మేధావులు, జగన్. పార్టీలో నంబర్-02 ఎవరన్నది ఇప్పుడు వైసీపీ క్యాడర్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే అన్నమాట.
సబ్జక్ట్ కావాల్సిందే..!
వైసీపీలో మహిళా నేతలకు కొదువ అయితే లేదు.. ఫైర్ బ్రాండ్లు ఉన్నారు.. సాఫ్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు.! కానీ వైఎస్ జగన్ ఈ సమయంలో సతీమణిని ఎందుకు తీసుకురావాలని అనుకున్నారు..? అంటే కచ్చితంగా రాజకీయ వారసత్వమే అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో ఒంటరై.. పార్టీలో ఒంటిరిపోరు అంటే అస్సలు అయ్యే పని కానే కాదు. అందుకే రేపొద్దున జరిగే పరిణామాలను ముందుగానే తెలుసుకున్న జగన్.. ఇక రంగంలోకి దింపాలని ఫిక్సయ్యి భారతీని రెడీ చేస్తున్నారట. దీనికి తోడు మీడియా బ్యాగ్రౌండ్ ఉండటంతో లేనిపోని విమర్శలు, ఆరోపణలు లేకుండా క్లియర్ కట్‌గా సబ్జక్టు మాట్లాడేందుకు అన్ని విధాలుగా చెబుతున్నారట. వారసత్వం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న జగన్ రెడ్డి తొలి అడుగు ఎంతవరకూ సక్సెస్ అవుతుంది..? ఇందులో నిజానిజాలెంత అనేది చూడాలి మరి.