ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు..? అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! ఈ పాట ఏమో కానీ.. నిమిష నిమిషానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయం గుర్తొస్తూనే ఉందట. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతోందో.. ఎలా తెల్లారుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారట. ఎప్పుడు ఎవరి నుంచి ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో.. ఎవర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారో అర్థం కాక తల పట్టుకుంటున్నారట. ఇది పార్టీ నేతల విషయంలోనే కాదండోయ్.. తన విషయంలోనూ ఎప్పుడేం జరుగుతుందో..? ఏ రోజు తన వంతు వస్తుందో తెలియట్లేదట.
ఏందో.. ఏమో!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయ్యింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ అండ్ కో బ్యాచ్ ఎంతలా విర్రవీగిందో.. అంతకు డబుల్ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. నాడు మంత్రులుగా మూడో కంటికి తెలియకుండానే బాబోయ్.. ఎన్నెన్ని ఘనకార్యాలు చేశారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కానీ అధినేతకు సైతం అర్థం కాని పరిస్థితి. అసలు ఇవన్నీ నా హయంలోనే జరిగాయా..? అని జగన్ మోహన్ రెడ్డే షాకయ్యారట. కూటమి సర్కార్ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం మొదలుకుని నిన్న, మొన్నటి వరకూ జరిగిన పరిణామాలన్నీ తలుచుకుని జగన్ అస్సలు కుదురుగా ఉండలేకపోతున్నారట. అవినీతి, అక్రమాలు అస్సలు లేనే లేవని పరిపాలన చేసిన వైసీపీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్.
ఎంత మంది ఉన్నారో..?
పిన్నెళ్లి రామకృష్ణారెడ్డితో మొదలైన వేట.. వల్లభనేని వంశీ మీదుగా.. మాజీ మంత్రులు జోగి రమేష్, రోజా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆగింది. రేపొద్దున్న ఇంకెవరు పేర్ని నాని కావొచ్చు.. కొడాలి నానీనే కావొచ్చు కానీ ఇంతటితో వేట అయితే ఆగదు మరి. వీటన్నింటి కంటే ముందుగా.. వైసీపీ తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్.. ఆఖరికి ఎస్‌ఐ, సీఐల వరకూ ఎక్కడికక్కడ బదిలీ చేసేసిన సర్కార్ లైన్ క్లియర్ చేసుకుని ముహూర్తం ఫిక్స్ చేసుకుని మరీ షురూ చేసింది. ఎందుకంటే.. ఎక్కడా లీకులు కాకుండా.. పరిణామాల తర్వాత పోలీసులు సపోర్టు లేకుండా ఇలా అన్ని విధాలుగా ఆలోచించి రంగంలోకి దూకేసింది టీడీపీ కూటమి. ఈ క్రమంలో ఎన్ని అరెస్టులు జరిగినా జరగొచ్చు.. ఎంత పెద్ద తలకాయ అరెస్టయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.
జగన్ వంతు కూడా..!
రెడ్ బుక్ ఇప్పుడిప్పుడే తెరిచిన మంత్రి నారా లోకేష్.. గుంటూరు, విజయవాడ జిల్లాల నుంచి కోతలు మొదలుపెట్టారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అది రేపొద్దున్న అటు నుంచి అటే కోస్తా, ఉత్తరాంధ్రకు వెళ్లి.. రాయలసీమకు వస్తుందట. పెద్ద తలకాయలతో మొదలైన ఈ వ్యవహారం అసలు సిసలైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగుతుందట.. అది ఇంకో ఏడాది పట్టొచ్చు.. ఏడాదిన్నర పట్టొచ్చని సోషల్ మీడియాలోనూ గట్టిగానే చర్చ జరుగుతోంది. అందుకే పార్టీలో ఏం జరుగుతుందో.. తన వంతు ఎప్పుడొస్తుందో కాస్త ఆందోళన చెందుతున్నారట. అయినా అరెస్టులు, గొడవలు.. కొట్లాటలు.. పోరాటాలు.. ఉద్యమాలు మాకేం కొత్త కాదని జరిగేది జరగక మానదు.. రేపు అనేది ఒకటి కచ్చితంగా ఉంటుంది కదా అప్పుడు చూద్దాం.. చూసుకుందాం అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటున్నారు.. ఎప్పుడేం జరుగుతుందో చూడాలి మరి.