తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి.. ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం..! బీఆర్ఎస్-బీజేపీ మధ్య దోస్తానా ఉందన్నది ఇప్పుడు కాదు పదేళ్ల నుంచి నడుస్తున్న చర్చే. ఇలాంటి మాటలు వచ్చిన ప్రతిసారీ మీడియా ముందుకు వివరణ ఇచ్చుకోవడం కూడా గులాబీ పార్టీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ నిజమే అయితే హ్యాట్రిక్ అట్టర్ ప్లాప్ అయ్యి కారు షెడ్డున ఎందుకు పడుతుంది..? పోనీ అదీ కాదనుకుంటే బాస్, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 150 రోజులుగా తీహార్ జైలులో ఎందుకు ఉంటారు..? అనేది మినిమ్ సెన్స్ కదా..! అయినా సరే ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి తోడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కొత్తగా వార్తలొస్తున్న పరిస్థితి.
లేదు.. మహాప్రభో!
ఓ వైపు కవితపై ఆరోపణలు.. మరోవైపు పార్టీ విలీనంపై వార్తలు వరుసగా వస్తుండటంతో.. ఇలా కాదని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని విషయాలపైనే ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు. నిజంగా మాకు బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ కవితమ్మ 150 రోజులు జైల్లో ఉండేదా?.. ఎందుకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జైలులో లేడు? అంటే ఎవరికీ లోపాయకారి ఒప్పందం ఉందో అర్థం చేసుకోండి.. బీఆర్ఎస్‌పై పెట్టినప్పటి నుంచి కుట్రలు చేశారు.. ఇంకో 50 ఏండ్లు కూడా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నమ్మండి మహాప్రభో అని నెత్తి నోరు మొత్తుకుని మరీ కేటీఆర్ చెప్పాల్సిన పరిస్థితి.
నాకు అంత అవసరమేంటి..?
కవిత నాకు చెల్లెలు.. సోదరుడిగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఢిల్లీకి వెళ్లి కలిస్తే తప్పేంటి..? ఆ మాత్రానికి ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉంటాయని అనుకోవడం తప్పు కదా అని ప్రశ్నించారు. ఒకవేళ సీక్రెట్ బేరాలు చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేవా..? అయినా మాకు అంత అవసరం లేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇంటి ఆడబిడ్డను జైల్లో పెడితే బీజేపీపై కొట్లాడాం.. కొట్లాడుతూనే ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ, నేతలు మాయం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు కానీ ఇదేమీ ఇప్పట్నుంచి కాదు.. బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు బరాబర్ పార్టీ ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పేశారు. ఇంత చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ ముడిపెట్టి రాసే వార్తలు ఆపుతారో లేదో చూడాలి మరి.