Advertisement
TDP Ads

ఉడుకు రక్తం ఏమైంది వైఎస్ జగన్?

Fri 16th Aug 2024 11:46 AM
ys jagan youth leaders  ఉడుకు రక్తం ఏమైంది వైఎస్ జగన్?
Jagan.. Where is Your Youth Leaders? ఉడుకు రక్తం ఏమైంది వైఎస్ జగన్?
Advertisement

వైసీపీలో ఉడుకు రక్తం ఏమైంది..? అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉడుకు రక్తం వదిలేసిందా..? అధికారం లేకపోయేసరికి యంగ్ లీడర్స్ అంతా అడ్రస్ లేకుండా పోయారేం..? మాజీ సీఎంను నమ్మినోళ్లే నట్టేట ముంచారా..? నాడు అధికారాన్ని అనుభవించి.. నేడు అధికారం అలా పోయిందో లేదో ముఖం చాటేశారా..? అంటే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. అసలే అధికారం పోయి నానా తిప్పలు పడుతూ క్యాడర్‌ను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెన్నంటి ఉండి ఏదో ఒకలా పార్టీ కోసం పనిచేయాల్సిన యువ నేతలు ఏమయ్యారు..? ఇంతకీ పార్టీలో ఉన్నట్టా.. లేనట్టా..? అనేది సొంత పార్టీ శ్రేణులకే అర్థం కావట్లేదు..!

ఎందుకిలా..!?

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి యువ రక్తాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు జగన్. అంతే కాదు ఊరూ పేరూ లేనివారికి.. కనీసం నియోజకవర్గం, రాజకీయం అంటే తెలియని వాళ్ళను కూడా అధినేత ఎక్కడికో తీసుకెళ్ళారు. ఇందులో సామాన్య కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. నామినేటెడ్ పదవులు లభించాయి. ఒకరా ఇద్దరా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితానే ఉంది. ఇదంతా 2014 నుంచి 2019 వరకు అంతే.. అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బో అదో పెద్ద కథే..! ఇంత చేసిన అధినేతకు వాళ్లంతా ఏమైనా చేశారా..? అంటే అబ్బే చేసింది ఏమీ లేదన్నది తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారం అలా పోయిందో లేదో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించట్లేదు.

ఒకరా.. ఇద్దరా..!

వైసీపీ అధికారంలో ఉండగా యువ నేతలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నన్ని రోజులు మీడియా ముందుకు రావడం, సోషల్ మీడియాలో వారికి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు కానీ.. ఎందుకో ఏమైందో కానీ వైసీపీ క్రికెట్ టీంకు పరిమితం అయ్యేసరికి.. ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. రేపో మాపో కనబడుటలేదు అని బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..! ఇలాంటి వాళ్ళు ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మార్గాని భరత్, నందిగాం సురేష్, నాగార్జున యాదవ్, ఆలూరు సాంబశివ రెడ్డి, శిల్పా రవి, గంగుల బ్రిజేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంటుంది. వీళ్ళలో కొందరు అలా వచ్చి ఇలా మెరుపు తీగలా కనిపిస్తుంటే అనిల్ లాంటి వాళ్ళు ఐతే అడ్రెస్స్ లేరు. కనీసం సోషల్ మీడియాలో అయినా చురుకుగా ఉన్నారా..? అంటే అదీ లేదు.

ఇంతేనా..!

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తిప్పికొడితే నలుగురు ఐదుగురు మాత్రమే క్రీజులో ఉన్నారు. ఇందులో.. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ మాత్రమే మీడియాలో కనిపిస్తున్నారు. వీరికి తోడు జనసేన నుంచి వైసీపీలోకి షిఫ్ట్ అయిన పోతిన మహేష్ మాత్రమే కనపడుతున్నారు.. వినపడుతున్నారు. ఫైర్ బ్రాండ్స్ రోజా సెల్వమణి, కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఇలా జిల్లాకొకరు ఉన్నారు. వీరంతా ఒకప్పుడు తమ పదునైన మాటలు, కౌంటర్ ఇచ్చేవారు.. ఇప్పుడు మాత్రం నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఒకవైపు పార్టీకి పెద్ద దిక్కుగా, జగన్ రెడ్డికి కుడి, ఎడమ భుజాలుగా ఉన్న నేతలు జంపింగ్ చేస్తుండటం, పార్టీలో ఉన్నోళ్లు క్రియాశీలకంగా లేకపోవడం, మరికొందరు పార్టీని ఎప్పుడెప్పుడు వీడి వెళ్ళిపోదామా..? అని ముహూర్తం కోసం కాచుకొని కూచున్నారు. మరికొందరు అయితే రాజకీయాలకే దూరం అవుతున్నారు. ఏంటి వైసీపీ అంటే ఇంతేనా..? ఇకనైనా అధికారం అనేది ఉన్నప్పుడే అనేది లేకుండా.. లేనప్పుడే కదా పార్టీకోసం పనిచేయడం, అన్ని విధాలుగా అండ దండలుగా ఉంటేనే కదా లీడర్ అనిపించుకునేది.. క్యాడర్ పక్క పార్టీ వైపు చూడకుండా కాపాడుకోవాలి కదా..! పోరాడితే పోయేది ఏముంది.. పార్టీనే బలపడుతుంది..! ఇకనైనా మార్పునకు శ్రీకారం చుడితే బాగుంటుందేమో సుమీ..!

Jagan.. Where is Your Youth Leaders?:

Youth leaders are not supporting YS Jagan

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement