ఏపీలో సంక్షేమ పథకాలు ఇప్పట్లో లేనట్టేనా?
ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయ్..? అసలు అవుతాయా.. లేదా..? ఒకవేళ ఐతే ఎప్పుడు..? అని టీడీపీ కూటమికి ఓటేసిన ఓటర్లు, లబ్ధిదారులు వేయి కళ్ళతో ఎదురు చూసి చూసి ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. ఇప్పుడిదే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. యావత్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చర్చించుకుంటున్న విషయం. దీనికి అసెంబ్లీ, మీడియా.. ఇంటర్వ్యూలలో నేతలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి కూడా పథకాల గురుంచి మాట్లాడుతూ చేతులు ఎత్తేసినట్టే అన్నట్టుగా చెప్పడంతో మరింత గందరగోళానికి పరిస్థితులు వెళ్లాయి.
ఏం జరుగుతోంది..?
ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డూ ఆర్ డై అన్నట్టుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఎన్నెన్ని హామీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. సూపర్ సిక్స్ తో పాటు.. చాలా హామీలు ఇచ్చి.. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్లు ఇలా ఒకటా రెండా అలవికాని హామీలు ఇచ్చినదని ఎన్నికల ప్రచారంలోనే వైసీపీ చెబుతూ వచ్చింది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు, మేధావులు సైతం ఇందులో అమలయ్యే హామీలు లేవని.. ఒకవేళ టీడీపీ అధినేత చంద్రబాబు చేయాలని ముందుకు వెళ్ళినా ఖజానా లేదు.. లక్షల కోట్లు కావాలని చెప్పారు. సూపర్ సిక్స్ నమ్మిన రాష్ట్ర ప్రజలు ఒక్కటే గుద్దుడు.. సైకిల్, కమలం, గాజు గ్లాసు గుర్తుకు గుద్ది పడేసారు. ఫలితం ఊహించని.. కలలో కూడా అనుకోని రీతిలో సీట్లు వచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక వై నాట్ 175 అంటూ.. నవరత్నాలు అటు ఇటు చేసి, ఎన్నికలకు వెళ్లిన వైసీపీని క్రికెట్ టీంకు మాత్రమే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు.
అన్నీ సరే కానీ..!
ఎన్నికల్లో చెప్పాం.. హామీలు ఇచ్చాం.. అధికారంలోకీ వచ్చాం.. వాట్ నెక్ట్స్ ..! ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడమే తరువాయి.. మరి ఎప్పుడు అమలు అయ్యేది..? అంటే సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేని పరిస్థితి. దీనికి తోడు స్వయంగా చంద్రబాబే హామీలు ఇచ్చాం.. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. భయమేస్తోంది..? ఖజానా ఖాళీగా ఉంది.. ఈ విషయాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పడంతో ఐదు కోట్ల ప్రజానీకం అవాక్కవుతున్నారు. పోనీ మంత్రులు ఐనా ఒక్క పథకం అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ముఖ్యంగా.. స్కూళ్ళు ప్రారంభం అవ్వగానే ఇస్తామన్న
తల్లికి వందనం ఏమయ్యిందో ఓటేసిన తల్లులకు.. గెలిచిన కూటమి సర్కారుకే ఎరుక. ఎన్నికల ముందు నీకు 15 వేలు, నీకు 15 వేలు అని టీడీపీ నేతలు ముఖ్యంగా నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలను పదేపదే గుర్తు చేస్తున్నారు. ఇప్పట్లో కష్టమే డేటా లేదు లెక్కలు తీయాలని.. అసెంబ్లీ వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కుండ బద్దలు కొట్టారు. ఇందులో ఎంత లాజిక్ లేని మాటలు ఉన్నాయంటూ వైసీపీ, లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక మిగిలిన విషయాల్లో కూడా సంబంధిత మంత్రులు చేతులు ఎత్తేశారు.
ఒక్క పెన్షన్ తప్ప...!
సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే ప్రతి నెలా ఇస్తూ వస్తున్న ప్రభుత్వం మిగిలిన హామీలను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐనా అధికారంలోకి సంపద సృష్టిస్తా.. పేదలకు పంచూతా అని చెప్పిన విజీనరీ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్స్ అయిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు..? అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కానీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. హామీల సంగతేంటి..? అని సామాన్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.. ఇక వైసీపీ ఐతే మీడియా ముందుకు వచ్చిన ప్రతి నేతా ప్రశ్నిస్తున్నారు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిలదేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తమ్మీద త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు మాత్రం ఈ ఏడాది అమలులోకి వచ్చే అవకాశం ఉండగా.. మిగిలినా హామీలు ఎప్పుడు సెట్ రైట్ అవుతాయో పైనున్న పెరుమాళ్ళకే ఎరుక. పోనీ హామీలు వచ్చే ఏడాది ఇస్తారా..? ఒకవేళ నిజమే ఐతే ఎప్పడి వరకూ అవ్వొచ్చు..? ఇన్నాళ్లు ఇవ్వని నిరుద్యోగ భృతి.. కలిపి ఇస్తారా..? అనేది ప్రభుత్వానికే తెలియాలి. ఇందులో ఒకటి రెండు హామీలు ఎగురిపోయినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదనే మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూటమిని నెత్తికి ఎత్తుకొని మరీ గెలిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో ఏంటో చూడాలి మరి.