అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే కానీ అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది..! రానున్న 2029 ఎన్నికల్లో ఐప్యాక్‌తో కలిసి నడవడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్వం సిద్ధం చేసుకున్నారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో కార్యకర్తలు మొదలుకుని నేతల వరకూ ముక్కున వేలేసుకున్నారట. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా తత్వం బోధపడకుంటే ఎలా..? వద్దు మహాప్రభో.. వద్దు.. వద్దంటే వద్దు అంటూ గగ్గోలు పెడుతున్నారట. అయినా సరే.. ఈ ఒక్కసారికి చూడండి.. అంటూ నేతలకు నచ్చజెబుతున్నారట జగన్. ఇందులో నిజానిజాలెంత..? అని వైసీపీ వర్గాలను సంప్రదించగా తెలిసిన నిజానిజాలేంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి!
2019 ఎన్నికల్లో యావత్ దేశమే ఊహించని రీతిలో 151 సీట్లతో అధికారంలోకి రావడానికి.. 2024 ఎన్నికల్లో జగన్ కూడా కల కనని రీతిలో క్రికెట్ టీమ్‌కు పరిమితం కావడానికి కర్త, కర్మ.. క్రియ ఐప్యాక్ అన్నది వైసీపీ నేతలు, కేడర్‌కు తెలిసిందే. 151 సీట్లు ఎక్కడ.. 11 స్థానాలు ఎక్కడ..? ఎక్కడ్నుంచి ఎక్కడికి పడిపోయారో చూస్తేనే ఐప్యాక్ వ్యూహ రచన ఎలా ఉందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. 2029 లో కూడా ఇదే ఐప్యాక్‌తో కలిసి అడుగులు వేయడానికి జగన్ సిద్ధమయ్యారంటే దీన్ని ఏమనుకోవాలి..? ఇంతకంటే పిచ్చి.. అమాయకత్వం.. అంతకుమించి ఇంకేమున్నా.. అవన్నీ అనుకోండి.. జగన్ ఉన్నాయని అనుకోవాలా..? లేకుంటే మైండ్ బెంగళూరు ప్యాలెస్‌లో వదిలేసి వచ్చారనుకోవాలో అర్థం కావట్లేదని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరిద్దరిని సంప్రదించే ప్రయత్నం చేయగా.. నిజమే కానీ అధికారిక ప్రకటన రాలేదు కదా కాస్త వెయిట్ చేయండన్నట్లుగా చెప్పడం గమనార్హం.
మళ్లీ.. మళ్లీ.. అవసరమా..!
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన తప్పులు ఉండొచ్చు గాక.. ఓటమిలో ప్రధాన పాత్ర మాత్రం ఐప్యాక్‌దేనని, సర్వనాశనం అయ్యింది ఆ టీమ్ వల్లనే అని ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చి సౌమ్యులు, కీలక నేతలు, ముఖ్యులు బల్ల గుద్ది మరీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో.. చరిత్ర కూడా కనివినీ ఎరుగని రీతిలో పరాజయం మిగిల్చిన ఐప్యాక్ దరిదాపుల్లోకి కూడా పోవద్దని నిర్ణయం తీసుకోవాల్సిన జగన్.. మళ్లీ మళ్లీ అదే కావాలని వెళ్తుండటం విచిత్రంగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే.. 2029 ఎన్నికల్లో వైసీపీ ఆశలు వదిలేసుకోవాల్సందేనన్న మాట. ఇప్పటికే 350 కోట్ల రూపాయిలు చెల్లించుకున్న జగన్.. ఈసారి గెలిపిస్తే డబుల్ ఇవ్వడంతో పాటు కోరింది ఇస్తానని కూడా డీల్ కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
సునీల్ ఏమయ్యారో..?
వాస్తవానికి వైఎస్ జగన్ బెంగళూరు పర్యటన వెనుక చాలానే సీక్రెట్స్ ఉన్నాయని పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఇందులో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సునీల్ కొనుగోలు అన్నది తాజాగా అందుతున్న సమాచారం. ఐప్యాక్ నుంచి విడిపోయి తన టీమ్‌ను ఏర్పాటు చేసుకుని రాజకీయ పార్టీలకు పనిచేస్తున్న సునీల్‌తో డీల్ కుదుర్చుకోవడానికి పదే పదే జగన్ బెంగళూరు బాట పడుతున్నారన్నది వైసీపీ కార్యకర్తలే కొందరు చెప్పిన మాట. ఎందుకంటే ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఏ రాష్ట్రంలో చేయిపెట్టినా గెలుపే అయ్యింది. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలకు పనిచేయగా ఊహించని రిజల్స్ట్ వచ్చాయి. అందుకే.. సునీల్‌ను వైసీపీ కోసం పనిచేయమని చెప్పడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా మంతనాలు జరిపారని తెలియవచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో.. చేయనని మొహమాటం లేకుండా చెప్పేశారో తెలియదు కానీ.. తిరిగి తిరిగి ఐప్యాక్ దగ్గరికి వచ్చి వాలిపోయారట జగన్. వాస్తవానికి.. గత నెల రోజులుగా వైసీపీ సోషల్ మీడియాను చూస్తే.. అచ్చు గుద్దినట్లుగా ఐప్యాక్ చేష్టలే కనిపిస్తున్నాయ్. దీంతో డీల్ ఓకే అయిపోయిందనే చర్చ మొదలైంది. అందుకే.. ఇక వైసీపీలో ఉంటే కష్టమేనని, రాజకీయ మనుగడ ఉండదని ఒక్కొక్కరుగా జంపింగ్‌లు.. మరికొందరు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారనే చర్చలు సైతం నడుస్తున్నాయ్.. ఇందులో నిజానిజాలెంతో ఐప్యాక్.. జగన్‌కే తెలియాలి మరి.