అవును.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది..! ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత అదే ఊపులో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయ్..! ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వచ్చిన అధినేత, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కూడా మరోసారి విచ్చేశారు. ఈసారి ఏకంగా రాష్ట్ర కార్యకర్తలు, అభిమానులకు ఒకింత బిగ్ అప్డేట్.. అంతకు మించి రాష్ట్రంలోని పార్టీలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాబు దెబ్బకు ఏ పార్టీ బలి అవుతుందో.. అబ్బా అనే అధినేత ఎవరో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.
ఇద్దరిలో ఎవరో ఒకరికి..!
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బాబు.. పార్టీ బలోపేతంపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ బాధ్యతలు నారా లోకేశ్ కి అప్పగించే అవకాశం ఉందా..? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? అనే ప్రశ్నలు మీడియా నుచి ఎదురయ్యాయి. మీ (విలేకరుల) ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ మేం ఆలోచించడం లేదు.. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అనిచంద్రబాబు ఒక్క మాటలో స్పష్టం చెప్పేసారు. ఐతే.. ఇద్దరిలో ఎవరో ఒక్కరికీ మాత్రం తెలంగాణ బాధ్యతలు త్వరలో రానున్నట్లు చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఐతే ఇచ్చేశారు.
కచ్చితంగా చేయాల్సిందే..!
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు పదే పదే కోరుతున్నారు. ఏపీని పునర్‌నిర్మాంచాలి.. ఇక్కడి మనోభావాలు కూడా గౌరవించాలి. తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టింది. ఇద్దరు ముఖ్యమంత్రులం ఇచ్చిపుచ్చుకునే విధంగా ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను. టీడీపీ తెలుగువాళ్ల కోసం పెట్టిన పార్టీ. మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. తెలంగాణలో టీడీపీ అగ్రస్థానానికి వెళ్లాలి అని తప్పక రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతానని కుండా బద్దలు కొట్టారు.
కొడుతున్నాం..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పిన బాబు మాటలతో కార్యకర్తలు, అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రతి నెల రెండవ శనివారం, ఆదివారం తెలంగాణకు చంద్రబాబు విచ్చేయనున్నారు. పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెడతామని.. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరుగుతుందన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమని.. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు రాకతో దెబ్బ పడేది ఎవరికి..? ఏ పార్టీకి నామరూపాలు లేకుండా పోతుందో అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఆందోళన మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.