వైసీపీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. కాస్త పత్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్! ఒకరా.. ఇద్దరూ ఎంత మంది బాగోతాలు బయటపడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్.. ఇప్పుడే దువ్వాడ శ్రీనివాస్ మధ్యలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా హాట్ టాపిక్ అయ్యిందో.. ఎందరి నోళ్లలో వీరంతా నానారో తెలిసే ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా చేద్దామనుకున్న ఈ వ్యవహారాలన్నీ వారి జీవితాలను రోడ్డు మీదికి ఈడ్చినవే..! ఇంత జరిగినా సరే తగ్గేదేలా అంటూ వైసీపీ నేతలు విర్రవీగిపోతున్నారు.
బాబోయ్.. ఏంటిది!
వైసీపీ అధికారంలో ఉండగా.. నాటి మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల గంట, అరగంటల వ్యవహారం పెను సంచలనమే అయ్యింది. నాడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదోలా మ్యానేజ్ చేసుకున్నారు కానీ.. ఇప్పుడు అధికారం లేదు.. మేనేజ్ చేసే మీడియానూ లేదు. అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలు చాలా జాగ్రత్తగా.. ఆచితూచి అడుగులు వేయాల్సింది పోయి.. అడ్డంగా బుక్కయ్యి నాలుగు గోడల మధ్య వ్యవహారాలు నలుగురిలోకి తెచ్చేసి.. మీడియాలో ఒక ఐటమ్‌లాగా మారిపోతున్నారు. పోనీ.. ఇంత జరిగిన తర్వాత మార్పు వచ్చిందా అంటే అబ్బే అస్సలు లేదు. వైసీపీలో ఉన్న కొందరు నేతల తీరుతో బాబోయ్.. ఇది పార్టీనా లేకుంటే..... నా అని కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ, జనసేన అధినేతలు, నేతలను వివాహ బంధాలు, వ్యక్తిగతంగా విమర్శించిన పరిస్థితులను ఇప్పుడు జనాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
మొన్న.. నిన్న.. రేపు!
ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి-శాంతిల వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మార్మోగింది. ఇప్పుడిప్పుడే సద్దుమణిగిందనే సరికి క్రీజులోకి దువ్వాడ శ్రీనివాస్ వచ్చేశారు. ఈయనపై సొంత భార్య, కన్న కూతుళ్లే పోరాటానికి దిగిన పరిస్థితి. ఇందుకు కారణం దివ్వెల మాధురి అనే మహిళతో ఉన్న సంబంధాలే. అమ్మ నాన్న ఓ మాధురి అన్నట్లుగా న్యాయం కావాలంటూ రాత్రింబవళ్లు దువ్వాడ బంగ్లా ముందు నిరసనకు దిగిన పరిస్థితి. దీనికి తోడు ఓ వైపు దువ్వాడ వాణి.. మరోవైపు మాధురి.. ఇంకోవైపు ఆయన కుమార్తె.. వీరందరికీ కౌంటర్‌గా శ్రీనివాస్ మీడియా ముందుకొచ్చి ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకోవడం.. రచ్చకెక్కడం గమనార్హం. తన వర్షన్ తాను చెప్పుకుని.. భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారంటే ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఇదీ లెక్క.. రేపొద్దున ఇంకెందురు బయటికొస్తారో.. ఏం జరుగుతుందో..! ఇలాంటి వ్యవహారాలన్నీ వైసీపీలోనే జరుగుతున్నాయా అంటే అదేమీ కాదు కానీ.. ఇలా బుక్కవ్వడంలో మాత్రం ఈ పార్టీనే ముందు వరుసలో ఉంది. అందుకే ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ మూడో కంటికి తెలియకుండా.. సంసారాలు రోడ్డున పడకుండా చూసుకుంటే మంచిదని సొంత పార్టీ కార్యకర్తలే సూచిస్తున్నారు సుమీ.