ఎవ్వరినీ వదలను.. తగ్గేదేలే !!
అన్నీ గుర్తుంటాయ్.. ఏదీ మరిచిపోను.. ఎవ్వరినీ వదలను..! కాస్త ఆలస్యం కావొచ్చు ఏమో.. అదేనబ్బా ఒక నెల, రెండు నెలలు, ఇంకా అంటే ఏడాది.. అదీ కాదంటే అధికారం వచ్చాక అంతే..! ఎప్పుడైతే ఏం కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు గట్టిగా ఇచ్చి పడేయడమే.. ఇవ్వాల్సింది ఇవ్వకపోతే లావు అయిపోతాం అని బాగా తెలుసుకున్నారు..! ఇలా ఒకటా రెండా అన్నీ గుర్తుకు తెచ్చుకొని మరీ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుమ్ము దులిపేస్తున్నారు. అంతే కాదండోయ్.. రీల్ జీవితంలో చేయలేక పోయినవి.. నిజ జీవితంలో చేయడానికి కూడా రెడీ అయ్యారు సేనాని..!
వదల.. వదల..!
జనసేన పార్టీ పెట్టింది మొదలుకుని 2024 ఎన్నికల ముందు వరకూ.. పార్టీ, పవన్ గురుంచి ఒకటా రెండా లెక్కలేనన్ని మాటలు.. నోటితో చెప్పుకోలేని, రాతల్లో రాయలేని మాటలు అన్నారు. ఆఖరికి ఆయన తల్లి, పెళ్ళిళ్ళు ఇలా అన్ని విషయాల్లో గుచ్చి.. గుచ్చి గాయం చేశారు. అయితే ఇన్ని మాటలు మాట్లాడినా సరే.. ఎక్కడా సహనం, ఓర్పు కోల్పోలేదు.. అంతే రీతిలో కౌంటర్ ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు తుక్కులేపి పడేసారు. మరీ ముఖ్యంగా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, జోగి రమేష్, కొడాలి నాని ఇలా చాలా మందే నోటికొచ్చినట్టు విర్రవీగి మాట్లాడారు. సీన్ కట్ చేస్తే వీరిని ఓడించడానికి పక్కాగా ప్లాన్ చేసి మరీ ఇంటికే పరిమితం చేయడంలో తన వంతు పోషించారు పవన్. ద్వారంపూడి చేయని సవాళ్లు లేవు.. మాట్లాడని మాటల్లేవ్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ద్వారాలు మూసేసారు. ఇక ఇలా ఎవరైతే తనను టార్గెట్ చేశారో ఒక్కో సైడ్ నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో గట్టిగానే ఇచ్చేస్తున్నారు.
ఇంటా లేదు.. బయటా లేదు!
బయటి వాళ్ళనే కాదు ఇంటివారు కూడా ఎవరు ఏమన్నా సరే వదిలేలా లేరు అని తాజాగా బెంగళూరు వేదికగా డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవి పరోక్షంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురుంచే అని అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ మద్దతు ఇవ్వడం.. గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు, అభిమానులకు పిలుపునివ్వడం ఆ తరవాత జరిగిన పరిణామాలు ఏమిటీ అనేది అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కుటుంబ సభ్యుడు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పటికి కేవలం ఒకే ఒక్క ట్వీట్ చేసి లైట్ తీసుకున్నారు అల్లు వారి అబ్బాయి. ఈ ఒక్క సంఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో కనిపించిన కుదుపులు అన్నీ ఇన్నీ కావు. అల్లువారింటికి, కొణిదెల కుటుంబానికి దూరం పెరిగిందని.. ఇప్పట్లో దగ్గరవడం కష్టమే అని రకరకాలుగా చర్చ జరిగింది. నాడు పవన్ స్పందించలేదు కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే హ్యాండిల్ చేసారు. ఇప్పుడు టైం రావడంతో ఊహించని రీతిలో ఇచ్చి పడేసారు.
మామూలుగా లేదుగా!
అటవీ పరిరక్షణ, ఎర్ర చందనం రక్షణకు సహకారంతో లాటు ఏనుగుల సమస్యకు పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన పవన్.. ఏడు అంశాలపై ఆంధ్రప్రదేశ్- కర్ణాటక అంతరాష్ట్ర ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పవన్.. 40ఏళ్ల కింద సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారని.. ఐతే ఇప్పుడు హీరోలు ఏకంగా అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు పవన్. అంతే కాదు.. చెట్లు నరికి వ్యాపారం చేసే హీరో పాత్రలతో ఉన్న సినిమాలు తాను చేయలను.. చూడలేను అంటూ పవన్ చెప్పుకొచ్చారు. అసలే మూవీ రిలీజ్ ఆలస్యం అవుతొందని తెగ బాధపడుతున్న ఫ్యాన్స్‌కు పవన్ కామెంట్స్ పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. చూశారుగా బన్నీ చేసిన ఒక్క పనితో ఎంత వరకూ వచ్చిందో..! మొత్తానికి చూస్తే.. డిప్యూటీ సీఎం కామెంట్స్ పుష్ప-02 ఫలితం మీద అది కచ్చితంగా ప్రభావం చూపే చాన్స్ ఉందని రాజకీయ, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్య నాగబాబు చేసిన ట్వీట్ ఎంతటి చర్చకు.. రచ్చకు దారితీసింది అనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ Vs అల్లు అర్జున్ అభిమానులుగా పెద్ద వార్ నడుస్తోంది. ఇక.. ఈ మొత్తం వ్యవహారంపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి.