దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఉంది కదా.. అక్షరాలా ఇది ఫాలో అయిపోతున్నారు మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు.
ఆయన నిర్మాతగా ఉన్నప్పుడు.. జనసేన బలోపేతం కోసం పనిచేసినప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నారు.. పైగా డిప్యూటీ సీఎంగా, పలు కీలక శాఖలకు మంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్డీఏలో మిత్రపక్షంగా చేరడం మొదలుకుని గెలుపు వరకూ సేనానిదే కీలక పాత్ర. ఇక నాగబాబు అయితే.. జనసేన తరఫున పోటీచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకోవడానికి మరీ ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేసిన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించడంలో అన్నీ తానై చూసుకున్నారు. అదేనండోయ్.. తమ్ముడు కూటమి గెలుపు కోసం అయితే.. అన్న జనసేన గెలుపు కోసం సాయశక్తులా కృషి చేసి 100 పర్సెంట్ స్ట్రైక్ రేటు కొట్టారు. ఇప్పుడు కష్టానికి ఫలితం దక్కింది.. అధికారంలో ఉన్నాం గనుక తనకు కావాల్సినవి ఒక్కొక్కటిగా షురూ చేస్తూ వస్తున్నారట మెగా బ్రదర్.
ఇంతకీ ఏమిటది..?
జనసేన అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామమే చోటుచేసుకోనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటి వరకూ నటుడిగా, నిర్మాతగా, కామెడీ షోలకు జడ్జీగా, రాజకీయ నేతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు.. ఇప్పుడిక సొంత మీడియాతో తెలుగు ప్రజల ముందుకు రాబోతున్నారట. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు N మీడియా ఎంటర్‌టైన్మెంట్స్ పేరిట మీడియా రంగంలోకి దూకబోతున్నారట. ప్రస్తుతానికి వినోదం కోసమేనని.. రానున్న రోజుల్లో న్యూస్ పరంగా కూడా ఓ చానెల్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించి లోగో, ఏయే ప్రోగ్రామ్‌లు ఉండాలి..? అనేదానిపై ఓ టాప్ మోస్ట్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. లైసెన్స్‌తో పాటు ఇతర వ్యవహారాలన్నీ పవన్ కల్యాణ్ దగ్గరుండి చూసుకోనున్నారట. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న అడిగింది ఇదొక్కటేనట.. అందుకే కాదనకుండా సేనాని సరే అన్నారట !
చాలానే ఉన్నాయే..!
తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్, యూట్యూబ్ చానెల్స్‌కు కొదువే లేదు. దీనికి తోడు ఎంటైర్‌టైన్మెంట్ చానెల్స్ సైతం ఉన్నాయ్.. ఇక వార్త చానెల్స్ అంటావా అబ్బో గట్టిగానే ఉన్నాయ్.. ఇందులో మళ్లీ ప్రత్యేకించి వినోదానికి గాను బులెటిన్స్ కూడా ఉన్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యూట్యూబ్ చానెల్స్ అయితే లెక్కే లేదు.. కామెడీ, వెబ్ సీరిస్‌లు చాలా వండి వారుస్తున్నారు. అయినా సరే ఎంటైర్‌టైన్మెంట్ చానెల్‌ను ప్రారంభించాలని నాగబాబు అనుకోవడం పెద్ద సాహసమే అనుకోవాలి. అయితే ఆయన టార్గెట్ ఇది కూడా కాదు.. న్యూస్ మాత్రమేనట. తొలుత ఇలా మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్లడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. వాస్తవానికి జనసేనకు సపోర్టుగా రెండు శాటిలైట్ చానెల్స్ కూడా ఉన్నాయ్.. దీనికి తోడు ఒక్క సాక్షి తప్పితే మిగిలిన చానెల్స్ ఏవీ వ్యతిరేకంగా వార్తలు ప్రస్తారం చేసే సీన్ కూడా లేదు. అధికారంలో జనసేన కూడా భాగమే కాబట్టి వ్యతిరేకంగా వార్తలు రాసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకైనా మంచిది.. రేపొద్దున్న పరిస్థితులు ఎలా ఉంటాయో అనుకున్నారేమో కానీ అధికారంలో ఉండగానే అన్నీ కానిచ్చేస్తున్నారట నాగబాబు. ఒకవేళ చానెల్ వార్త నిజమే అయితే.. ఆల్ ది బెస్ట్ మెగా బ్రదర్..!