వైఎస్ జగన్ ఉండి ఉంటే ఈ రోజు అమ్మఒడి కింద రూ.15 వేలు ఇచ్చుండే వాడు.. ఇప్పుడు ఆ రూ.15 వేలు పోయే.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు ఇస్తానని చెప్పిందీ పోయింది..! జగన్ ఉండి ఉంటే రైతు భరోసా కింద రూ.13,500 చేతిలో పడేవి.. చంద్రబాబు వచ్చాడు. రూ.20 వేలు ఇస్తానన్నాడు. జగన్ ఇస్తానన్న రూ.13,500 పోయాయి. చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు మొత్తమే రాకపోయే..!. మీ జగన్ ఉండి ఉంటే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు జమ అయ్యేవి.. వసతి దీవెన పథకం కూడా పోయింది..! జగన్ ఉండి ఉంటే.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఏప్రిల్‌లో పడాల్సిన సున్నా వడ్డీ డబ్బులు కూడా రాలేదు..! ఇవీ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట పదే పదే వస్తున్న మాటలు. ఉండుంటేనే కదా ఇవన్నీ.. సరే జగన్ లేడు.. ఇప్పుడు ఏం చేద్దాం.. ఏం చేయాలి..? అనేది మాత్రం తెలియకపోతే ఎలా..!!
ఇంకెన్నాళ్లు ఇలా..?
అవును.. నవరత్నాలు అంటూ అమ్మ ఒడి ఇచ్చినా, రైతు భరోసా వేసినా, విద్య దీవెన, వసతి దీవెన అని బటన్లు నొక్కినా వైఎస్ జగన్ ఓడిపోయారు..! అసలు ఎందుకు ఓడిపోయాం.. ఎక్కడ తేడా కొట్టింది అనేది తెలుసుకోకుండా.. కనీసం రివ్యూ చేసుకోకుండానే జగన్ ఎందుకు పదే పదే ఇలా మాట్లాడేస్తున్నారో వైసీపీ నేతలకే అర్థం కాని పరిస్థితి. మళ్లీ మళ్లీ అవే మాటలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? ఓటమి కారణాలు ఇంకా తెలుసుకోవట్లేదంటే ఇప్పటికీ ఈవీఎంలనే అనుమానిస్తున్నారా..? ఇంకెన్నాళ్లు ఇలానే అరిగిపోయిన క్యాసెట్‌లాగా రిపీట్ చేస్తుంటారు. ఒకసారేమో ఈవీఎంలను.. ఇంకోసారేమో అన్న చెల్లెళ్ల ఆప్యాయత.. ఏమైందో అని ఏడుపులు ఇవేనా..? ఇంకెన్నాళ్లు ఇలా మాట్లాడుకుంటూనే పోతారు..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే అనుమానిస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకుడు ఎదగాలంటే విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలనే డైలాగ్స్ కూడా మానుకుంటే మంచిదేమో సుమీ.
జర తెలుసుకో సామీ..!
ఉండుంటే ఇది జరిగేది.. అది జరిగేది.. అని పదే పదే చెప్పుకోవడం ఎంతవరకూ సబబు..? అవును.. మీ హయాంలో మీరిచ్చారు కాదనట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. కూటమి పార్టీలు కూడా గట్టిగానే హామీలిచ్చాయ్. సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడేం చేస్తున్నాయ్..? ప్రజలకు ఏ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాయ్..? అనేది ప్రశ్నించు..? అవసరమైతే దీనికోసం ఊరూ వాడా రాష్ట్రం మొత్తం ధర్నాలు, నిరసనలు.. ర్యాలీలతో హోరెత్తించు.. తప్పేముంది..? ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకూ పోరాటం చేస్తూనే ఉండు.. ఎవరొద్దన్నారు..? అంటే ఒక్క శాంతి భద్రతల విఫలం అయ్యాయని ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే ఢిల్లీలో ధర్నా చేస్తారు కానీ.. ప్రజలకు రావాల్సిన ఫలాల విషయంలో పట్టవా..? ఇకనైనా మారకుంటే ఎలా.. అయినా.. కూటమి సర్కార్‌కు తమరు చెప్పిన హనీమూన్ పిరియడ్ అయిపోయినట్టే కదా.. ఇక మొదలుపెట్టండి మరి. ఫైనల్‌గా.. అది ఇచ్చాం.. ఇదిచ్చాం... ఇప్పుడు అది లేదు.. ఇదిలేదు.. ఈవీఎంల వల్లే ఓటమి ఇవన్నీ పక్కనెట్టి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో గుర్తించనంత వరకు ఓటమి కారణాలు తెలియవు.. గెలుపు తలుపు తట్టదు.. అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది జగన్..!