పార్టీ మారుతున్న రోజా.. వైసీపీ హ్యాపీ!
వైసీపీ రెబల్, మాజీ మంత్రి రోజా సెల్వమణి పార్టీని వీడుతున్నారు..! ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఓ వైపు ఆమె అడ్రస్ లేకుండా పోవడం.. మరోవైపు రెండుసార్లు గెలిపించిన నగరి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులను కనీసం పట్టించుకోకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయ్..! ఒకవేళ వైసీపీని వీడటం నిజమే అయితే ఏ పార్టీలోకి వెళ్తు్న్నారు..? ఏం చేయబోతున్నారు..? అసలు రోజా టార్గెట్ ఏంటి..? ఓడిన వైసీపీలో అంత మంది ఉండగా రోజానే ఎందుకిలా మీడియా టార్గెట్ చేసింది..? ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..
ఏం జరుగుతోంది..?
రోజా.. తన పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా వదిలేసి.. మెట్టినిల్లు తమిళనాడులో సెటిల్ అవుదామని అనుకుంటున్నారట. అంతేకాదు.. తమిళనాట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని టాక్. ఎందుకంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా పనిచేసిన ఫైర్‌బ్రాండ్ మూడోసారి నగరిలో బొక్కబోర్లా పడ్డారు. దీనికి కారణం సొంత పార్టీ నేతలే శపథం చేసి మరీ ఓడించడం.. 2029 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసే పరిస్థితి కూడా లేదన్నది ఆమె భావనట. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్షాలు పచ్చి బూతులతో తిట్టేసిన సందర్భాలు అన్నీ ఇన్నీ కావు. ఇదొక్కటే కాదు మోనార్క్‌లాగా వ్యవహరించిన తీరు ప్రత్యర్థ పార్టీతో పాటు సొంత పార్టీ కార్యకర్తలు, నేతలను సైతం దూరం చేసింది. దీంతో ఇక నగరి కాదు కదా.. ఏపీలోనే ఉండకూడదని ఫిక్స్ అయ్యారట.
ఆల్ ది బెస్ట్..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయని చర్చ జరుగుతోంది. ఎక్కడ్నుంచి పోటీచేయాలనే దానిపై కూడా ఫిక్స్ అయ్యారట. తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగడం, భర్త ఆర్కే సెల్వమణిది తమిళనాడే కావడం.. పైగా అక్కడ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్, నిర్మాతగా మంచి గుర్తింపు ఉండటం.. దీనికి తోడు తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తారని రోజా చాలానే కలలు కంటున్నారట. ఈ క్రమంలోనే నగరిని పూర్తిగా వదిలేసి తమిళనాడు చుట్టూనే తిరగడం మొదలెట్టారని చర్చ కూడా జరుగుతోంది. గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఎక్కువ సమయం చెన్నైలోనే గడిపేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో హమ్మయ్యా.. పార్టీకి పట్టిన దరిద్రం పోయింది ఆల్ దిబెస్ట్ రోజా అని సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నియోజకవర్గ నేతలు.. అభిమానులు ఎంతో హ్యాపీగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు.
నిజమెంతో..!
అరవ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రోజా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. 2026లో తమిళనాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. పైగా ఇప్పుడు ఆయనకు అనుభవం ఉన్న, ప్రజల్లో కాస్తో కూస్తో గుర్తింపు ఉన్నోళ్లు సపోర్టుగా ఉండాల్సి ఉంది. ఎలాగే ఏపీలో పరిస్థితులు అనుకూలించకపోవడం.. ఇప్పటికిప్పుడు నగరిని కాదని కొత్త నియోజకవర్గాన్ని చూసే పరిస్థితి లేకపోవడంతో అసలు రాష్ట్రంలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారట. అందుకే.. ఇక మెట్టినిల్లులో రాజకీయ భవితవ్యం తేల్చుకోడానికి సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు, చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తమిళనాడే బెస్ట్ అని సన్నిహితులు సైతం గట్టిగానే చెబుతున్నారట. ఇందులో నిజమెంత..? అసలు అయ్యే పనేనా..? అనేది తెలియాలంటే రోజా రియాక్షన్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.