పడతాం.. లేస్తాం.. పోరాడుతాం కానీ తలవంచం!
గుండెలు నిబ్బరం చేసుకొని వినండి.. ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన.. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ విలీనం కాబోతోంది..! తప్పదు అయినా సరే చెబుతున్నా ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది..! ఎన్నికల తర్వాతే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాంతో హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పడాలి కాబట్టి..! ఇదీ ఒక పేరుగాంచిన యూట్యూబ్ ఛానెల్ బ్రేక్ చేసిన వార్త. ఇదంతా చేసింది ఎవరబ్బా అనుకుంటున్నారేమో Rtv ఎండీ రవి ప్రకాష్. మీడియాలో పండిన వ్యక్తి కావడంతో ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని జనాలు అంతా నమ్మరు కూడా. సీన్ కట్ చేస్తే ఇదంతా అక్షరాలా అచ్చు తప్పు గులాబి నేతల మాటలతో తేలిపోయింది.. దీనికి అదనంగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలకు హెచ్చరికలు అదనం.
ఎందుకు ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎలా ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఐతే నిత్యం ఏదో ఒక రచ్చ చేస్తూ చర్చకు తావిస్తూనే ఉన్నాయ్. అలాంటిదే ఇప్పుడు Rtv లో వచ్చిన వార్త. వాస్తవానికి బీఆర్ఎస్ అంటే రవికి అస్సలు పడదు. ఎందుకంటే.. టీవీ9 ఛానెల్ వదిలి బయటికి రావడానికి.. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటానికి కర్త, కర్మ, క్రియ గులాబి బాస్ కేసీఆర్ అన్నది ఆయన ఆరోపణ. అందుకే బీఆర్ఎస్ గురుంచి వార్తలు వచ్చినప్పుడల్లా హార్ట్ ఎటాక్ వచ్చేలా చెబుతుంటారు. ఈ క్రమంలోనే రవి ప్రకాష్ పాత బాగోతాలు అన్నీ బయటికి తీసి.. ఇదీ తమరి బతుకు అంటూ ఆడియో, వీడియోలు.. ఫోటోలు సైతం బయటికి తీసి వైరల్ చేస్తున్నారు. అటెన్షన్, వ్యూయర్షిప్ కోసం ఇలా అవాస్తవాలను ప్రసారం చేస్తారని కారు పార్టీ నేతలు చెబుతూనే ఉంటారు. రాజకీయ భూకంపం.. BJPలోకి BRS అనే బ్లాస్టింగ్ వార్తకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సపాందించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
వివరణ ఇస్తే సరే..!
బీఆర్ఎస్ విలీనం, పొత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీపైన విలీనం లాంటి ఎజెండాపూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి.. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం కానీ తలవంచం అని అవాస్తవాలు ప్రసారం చేసే మీడియా సంస్థలు, వ్యక్తులకు కేటీఆర్ గట్టిగా ఇచ్చి పడేసారు. మరి రవి ప్రకాష్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి..? కేటీఆర్ కౌంటర్ పై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.