వైసీపీనీ తొక్కడమే కాదు.. ఖాళీ చేయడమే!
గుర్తుపెట్టుకోండి.. వైసీపీని అదఃపాతాళానికి తొక్కిపడేస్తా.. ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పిన మాట. అనుకున్నట్టే వైసీపీని అడ్రెస్స్ అదికూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో ప్రధాన పాత్రే పోషించారు. ఈ దెబ్బ జగన్ రెడ్డికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ దెబ్బ, ఊహించని షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదు మరో భారీ జలక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు సేనాని. అదేంటో కాదండోయ్.. వైసీపీ నామరూపాల్లేకుండా చేయడమేనట.
అవునా.. అదెలా!
2024 ముందు ఒక లెక్క.. 2024 ఎన్నికలు తర్వాత జనసేన లెక్కే వేరు. ఇది తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ ప్రపంచమే చూసింది. ఎన్డీఏతో పొత్తులో భాగంగా దక్కించుకున్న 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటును దక్కించుకుంది జనసేన. ఇంకొన్ని సీట్లు తీసుకొని ఉన్నా గెలిచి నిలిచేది. ఇలా వైసీపీని ఓడించాలని టార్గెట్ మొదలుకుని.. కూటమి కట్టడం, ఎన్నికల ప్రచారం, సూపర్ సిక్స్, ఢిల్లీ పెద్దలను ఒప్పించడం.. ప్రభుత్వ ఏర్పాటు చేయడం వరకూ అన్నిటిలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అలాంటిది ఇప్పుడు సేనాని ముందున్న ఏకైక టార్గెట్ రేపు పొద్దున్న మిత్రపక్షంలో ఉన్నా లేకున్నా ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీ బలోపేతం కోసం ఇప్పటి నుంచే ఆట మొదలు పెట్టినట్టుగా క్లియర్ కట్ గా అర్థం అవుతోంది.
తగ్గేదెలా..!
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ గెలిచిన క్రికెట్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కాపాడుకునే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. ఐనప్పటికీ ఎవరు ఎప్పుడు వైసీపీ కండువా తీసేసి.. పసుపు, ఎరుపు, కాషాయ కండువాల్లో కనిపిస్తారో అర్థం కావట్లేదు. ఇప్పటికే గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి మొదలైన జంపింగ్స్ కార్పొరేటర్లు, మేయర్లు.. కీలక నేతలు వరకూ వచ్చి చేరింది. ఇక సిట్టింగులు మాత్రమే ఇవాళ.. రేపా అనేది ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ వైసీపీ నుంచి వచ్చే చేరికలను పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇదే సరైన సమయం అని జనసేన మాత్రం తలుపులు తెరిచేసింది.. రండమ్మా రండి.. కండువాలు కప్పేందుకు మేం రెడీ అంటూ పవన్ కల్యాణ్ సిద్ధం అంటూ పరోక్షంగా ప్రకటన చేసేశారు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏలోని రెండు పార్టీలు తగ్గినా.. జనసేన మాత్రం తగ్గేదెలా అంటోంది అన్న మాట.
వామ్మో ఈ రేంజిలోనా!
ఒకరా.. ఇద్దరా పదుల సంఖ్యలో మాజీలు, కీలక నేతలు రాజీనామా చేసి రెడీగా ఉన్నారు. త్వరలోనే బిగ్ షాట్ నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమై పోయారు. ఇప్పటి వరకూ.. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గుంటూరు మేయర్ కావేటి మనోహర్ నాయుడు కూడా ఇదే బాటలో నడించేందుకు రెడీ అయ్యారట. గుంటూరు పార్లమెంట్ ఇంచార్జ్ కిలారి రోశయ్య ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసేశారు కూడా. ఇదే జరిగితే దాదాపు గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అక్కడ.. ఇక్కడా.. అన్ని చోట్లా..!!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. తాను, తన పార్టీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితికి కారణమైన కాపులు ఉన్న గోదావరి జిల్లాల్లో జనసేనను మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏ రేంజిలో అంటే.. తనపైన పోటీ చేయడానికి సిద్ధమైన ప్రత్యర్థినే పార్టీలో చేర్చుకునేంత..! పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయగా.. వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గీత స్థానంలో పెండెం దొరబాబు పోటీ చేయాల్సి ఉంది. ఐతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా.. సినియారిటీ దీనికి తోడు ప్రత్యర్థి బలమైన వ్యక్తి కావడంతో దొరబాబును కాదని గీతను జగన్ పోటీ చేయించారు. ఐతే వైసీపీ పెద్దలు అనుకున్నది ఒకటైతే పిఠాపురం ప్రజలు తీర్పు మరోలా అయ్యింది. ఒక్క ఈ నియైజవర్గంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దొరబాబుతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన కీలక నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు జగన్ సొంత జిల్లా కడప మొదలుకుని రాయలసీమ, కోస్తా వరకూ చాలా మంది కీలక నేతలే జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. జగన్ ఏ మాత్రం ఈ చేరికలు చేరకుండా ఆపగలరో చూడాలి మరి. చూశారుగా.. వైసీపీని ఎన్నికల్లో తొక్కేయడమే కాదు.. ఎన్నికల తర్వాత ఖాళీ చేయడానికి గట్టి ప్రయత్నాలే పవన్ చేస్తున్నారు. ఐనా డిప్యూటీ సీఎంకు ఇదొక సువర్ణ అవకాశమే.. చూడాలి సక్సెస్ రేటు ఎలా ఉంటుందో..!!