అవును.. వైసీపీలో ఎందుకో తేడా కొడుతోంది..! మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఈ పరిణామంతో పార్టీ ఎక్కడికో పోతుందా లేకుంటే.. పార్టీలో ఉండేవాళ్లు ఇంకెక్కడికో జంప్ అవుతారా..? అనేది తెలియట్లేదు కానీ మొత్తానికి తెర వెనుక ఏదో జరుగుతోందని మాత్రం క్లియర్‌గా అర్థమవుతోంది. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో జరగట్లేదు.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నడుస్తున్నదే..! ఇంతకీ హస్తినలో ఏం జరుగుతోంది.. అక్కడ అంతా కథ నడిపిస్తున్నదెవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీకి పరిస్థితులు అస్సలు అనుకూలించట్లేదు. ఓ వైపు ప్రతిపక్ష హోదా లేకపోవడం.. మరోవైపు భద్రత అడిగినా ఇవ్వకపోవడం ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే ఏపీలో శాంతి భద్రతలు లేవని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. అది ఎంతవరకూ సక్సెస్ అయ్యిందో వైసీపీకే తెలియాలి. ఇక.. అవన్నీ అటుంచి అసలు విషయానికొస్తే ఢిల్లీ ధర్నాకు ముందు ఆ తర్వాత.. ఈ మధ్యే వారం రోజుల్లోనే రెండుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇక్కడే ఏదో తేడా కొడుతోందని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరూ అనుకుంటున్నారు.
ఏం జరుగుతోంది..?
వైసీపీ-ఎన్డీఏ మధ్య బంధం ఈనాటిది కాదు.. సమయం, సందర్భాన్ని బట్టి ఈ బంధం బయటపడుతూనే వస్తోంది..! ఎందుకంటే.. రాజ్యసభలో ఎన్డీఏకు బలం లేదు గనుక బిల్లలు విషయంలో మద్దతిస్తూనే వస్తోంది వైసీపీ. అలా మొదలైన బంధం నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఆఖరికి వైసీపీకి చెందిన నలుగురు ఐదుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే వారం రోజుల్లోనే రెండు సార్లు అమిత్ షాతో విజయసాయి భేటీ కావడంతో.. వైసీపీని విలీనం చేస్తున్నారా..? లేకుంటే రాజ్యసభ ఎంపీలు జంప్ కావడానికి సాయిరెడ్డి అన్నీ సెట్ రైట్ చేస్తున్నారా..? అన్నది అర్థం కావట్లేదు. దీనికి తోడు వైఎస్ జగన్ మెడకు అక్రమాస్తుల కేసులు గట్టిగానే చుట్టుకునేలా ఉన్నాయ్.. ఇక ఏపీ ప్రభుత్వం పెట్టే కేసులు బోనస్ కాబోతున్నాయ్.. ఈ క్రమంలో సాయిరెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు..? అనేది వైఎస్ జగన్‌కే తెలియాలి మరి.