వైసీపీకి పేర్ని నాని ఒక్కడే దిక్కు..!
వైసీపీకి ఓకే ఒక్కడు పేర్ని నాని మాత్రమే దిక్కు అయ్యారు..! ఒకప్పుడు పదులు, వందల సంఖ్యలో ఉన్న నేతలు ఇప్పుడు ఎక్కడున్నారో..? ఏమయ్యారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి..! అధికారంలో ఉన్నా లేకున్నా సరే.. ఈయన మాత్రం మీడియా ముందుకొచ్చి తన గళం వినిపిస్తూనే ఉన్నారు..! ఇక మిగిలిన వారంతా అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి.. అటు అధికారం పోయిందో లేదో చాప చుట్టేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ వాయిస్ వినిపించడానికి ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావట్లేదు. వాయిస్ సంగతి దేవుడరుగు అసలు మనుషులే కనిపించట్లేదు..!
నాడు.. నేడు..!
2014 నుంచి 2024 వరకూ వైసీపీ అంటే ఎలా ఉండేది..? అధినేత వైఎస్ జగన్ ఎలా ఉండేవారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మొత్తం మారిపోయింది. మరీ ముఖ్యంగా.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, వైసీపీ అధికార ప్రతినిధులు, సలహాదారులు.. ద్వితీయ శ్రేణి నేతలు దీనికితోడు సోషల్ మీడియా ఒక రేంజిలో ఉండేది. ఎప్పుడైతే అధికారం పోయిందో అడ్రెస్ లేకుండా పోయారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కరూ పార్టీ వాయిస్ వినిపించడానికి ముందుకు రావట్లేదు. అంటే వాళ్లకు కావాల్సింది అధికారం మాత్రమే అన్న విషయం జగన్ రెడ్డికి ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందేమో..!
భయం.. భయం!
ఐతే.. మాజీలు, సీనియర్లు నోరు మెదపక పోయినప్పటికీ ఒక్కడు ఒకే ఒక్కడు పేర్ని నాని మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. వైసీపీని కూటమి నేతలు విమర్శిస్తే చాలు నిమిషాల్లో వచ్చి వాలిపోతూ కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవానికి ఈయన సబ్జెక్ట్ పరంగా మంచి టాలెంట్.. అన్నిటిపైనా పట్టు ఉన్న నేత కావడంతో ప్రెస్ మీట్ పెట్టడానికి సాహసం చేస్తున్నట్టు క్యాడర్ చెబుతూ ఉంటుంది. ఇక మిగిలిన అదేనబ్బా ఒకప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా వాగిన, బూతుల వర్షం కురిపించిన నాటి మంత్రులు ఎందుకు నోరు మెదపడలేకుండా ఉన్నారో తెలియలేదు. ఐతే ఎవరు నోరు తెరిస్తే.. ఆ మరుక్షణం ఏమవుతుందో అని భయపడిపోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైతేనేం నాని ఒక్కడే వంద మందితో సమానం అని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఐనా ఒక్కరే పదే పదే మీడియా ముందుకు వస్తే అంత బాగోదు ఏమో హైకమాండ్ ఆలోచిస్తే మంచిదేమో..!