ఒకప్పుడు అమెరికా అంటే అల్లంత దూరాన ఉన్న దేశం.. కానీ ఈరోజు 24 గంటల జర్నీ చేస్తే అమెరికాలో తేలుతాం. అమెరికా అంటే డాలర్స్ ప్రపంచం.. కాబట్టే యూత్ మొత్తం అమెరికా వెంట పరుగులు పెడుతుంది. ఇక్కడ అపురూపంగా అమ్మ చేతి గోరు ముద్దలు తిని అల్లారు ముద్దుగా పెరిగిన వారు కూడా అమెరికా వెళ్లి తిన్న ప్లేట్స్ కడగడమే కాదు, చదువుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూనే కాసుల కోసం కాచుకుని కూర్చుంటారు.
MS పూర్తి కాగానే సాఫ్ట్ వేర్ జాబ్ వెతుక్కుని ప్యాకేజీల పేరుతో కష్టపడుతూ ఆ డాలర్స్ ని ఇండియన్ రూపీస్ గా మార్చి ప్రాపర్టీస్ కొనుక్కుని హైఫై, లగ్జరి లైఫ్ కోసం ఆరాటం. అందుకే ఎలాగైనా అమెరికా వెళ్లాలనే కోరిక, ఇక్కడ బీటెక్ పూర్తి కాగానే అమెరికా కల నెరవేర్చుకోవడానికి వీసా కోసం ప్రయతనాలు చేస్తారు. అక్కడ గంటల లెక్కన పని చేసి డాలర్స్ సంపాదిస్తారు. అసలు ఇండియా లో లైఫ్ లేదు అని ఫీలైపోతుంటారు.
కానీ ఇప్పడు అమెరికా డాలర్ డ్రీమ్స్ అన్ని కల్లలైపోతున్నాయి. ప్రతి ఏడాది లక్షలమంది విద్యార్థులు అమెరికా పయనమవుతున్నారు. ప్రస్తుతం అంటే గత రెండేళ్ళుగా అమెరికా లో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. అక్కడ ఉద్యోగాలు లేవు, అమెరికా పౌరులకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేక అల్లాడుతుంది అక్కడి ప్రభుత్వం. ఉద్యోగాలు చేస్తున్న ఇతర దేశస్తులు కూడా తమ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక టెన్షన్ తో బ్రతుకుతున్నారు.
ఇతర దేశాల నుంచి అమెరికా వస్తున్న వారు.. చదువు అయిపోయిన తరవాత ఉద్యోగం పొందడానికి చాలా కష్ట పడాల్సి వస్తోంది. ఉద్యోగం రాక, రెండేళ్లుగా ఖాళీగా ఉండలేక, తిరిగి తమ దేశం వెళ్లలేక చాలామంది విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాకి వచ్చేస్తే తమని చిన్న చూపు చూస్తారేమో అనే భయం చాలామందిలో ఉంది. మరికొంతమంది అమెరికాకి వెళ్ళకండి, ఇక్కడికి వచ్చి పాట్లు పడకండి అంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించినా అమెరికా ప్రయాణాలు ఆగడం లేదు.
అక్కడ ఎలా ఉన్నా అమెరికా వెళ్లి చదివెయ్యాలనే కోరికతో ఇంకా చాలామంది అమెరికా ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. వారెప్పటికి అసలు విషయం అవగతం చేసుకుంటారో చూద్దాం.!