బొత్స గెలిస్తే సరే.. ఓడితే అంతే!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి సరికొత్త ఛాలెంజ్..! క్యాడర్ మునుపటిలా ఉండాలంటే ఇది సక్సెస్ ఐతే సరే లేదంటే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది..!ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి అనేదే కదా మీ సందేహం.. అదేనండోయ్.. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలే..! ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నదే పంతం..!
బొత్సనే ఎందుకు..?
విశాఖ స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే అంత ఆషామాషీ కానే కాదు. జిల్లాలో పెద్ద పెద్ద తోపులు, తురుములు ఉన్నప్పటికీ పక్క జిల్లా అయిన విజయనగరం నుంచి రప్పించి మరీ పోటీ చేయిస్తున్నారు జగన్. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకురాగలరనే వైసీపీ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత, కాంగ్రెస్ నుంచి మంచి పరిచయాలు.. అంతకుమించి ఆర్థికంగా గట్టిగానే ఉన్న వ్యక్తి. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని వైసీపీ పావులు కదుపుతున్నది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 841 ఓట్లు ఉండగా.. 75 శాతం అనగా 615 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. ఇక టీడీపీకి కేవలం 215 ఓట్లు మాత్రమే. ఎన్నికల ముందు.. ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నిక రసవత్తరంగానే మారింది. ఈ క్రమంలో ఓటర్లను నిలబెట్టుకోవడం అంటే అదొక పెద్ద సవాలే.
అన్నీ సరే కానీ..!
ఇవన్నీ ఒక ఎత్తయితే లోకల్-నాన్ లోకల్ అనే గొడవ మాత్రం గట్టిగానే జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ నుంచి బొత్స సతీమణి ఝాన్సి పోటీచేశారు. ఇప్పుడేమో బొత్సా.. దీంతో జిల్లా నేతలు రగిలిపోతున్నారు. ఇక్కడెవరూ ఎమ్మెల్యే పోటీ చేయడానికి మగాడు లేడా..? సరైనోడు దొరకట్లేదా..? అన్న సందేహాలను వెలిబుచ్చుతున్నారు. అయితే.. పీసీసీ అధ్యక్షుడిగా, 15 ఏళ్ల పాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్సకు ఉత్తరాంధ్రలో మంచి పట్టు ఉంది. వైసీపీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అధికార పక్షం తన అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కూటమి అభ్యర్థి ఎవరై ఉంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి ఎన్నిక కావడంతో కూటమి.. బొత్సాతో బోణీ కొట్టాలని వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయ్. ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.