అర్జెంట్.. బుద్దాకు పదవి కావలెను!!
బుద్దా వెంకన్న.. తెలుగుదేశం పార్టీకి కరుడుకట్టిన నేత..! ఎంతలా పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం.. అవసరమైతే పార్టీ గెలుపు కోసం ఉగ్రవాదిగా మారుతానని చెప్పిన రోజులూ ఉన్నాయ్..! అధినేత చంద్రబాబు రక్తంతో రాతలు రాసిన రోజులున్నాయ్..! పార్టీ గెలవకపోతే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్..! ఇలా టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా.. తనకు పదవి ఉన్నా లేకున్నా సరే రోజూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు..! అలాంటిది.. ఇప్పుడు ఎందుకోగానీ అధికారంలోకి వచ్చినప్పటికీ బుద్దాలో అసంతృప్తి అస్సలు తగ్గడం లేదనే చెప్పుకోవాలి..!
ఏం జరిగింది..!?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని బుద్దా వెంకన్న చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ ఆఖరికి వృథానే అయ్యాయ్. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తనకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.. ఇచ్చి తీరాల్సిందే అన్నట్లుగా పరోక్షంగా డిమాండ్ అయితే హైకమాండ్ ముందు పెడుతున్నారు. అది కూడా అర్జెంట్‌గా ..! ఆగస్టు-03 విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ పుట్టిన రోజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్దా.. టీడీపీ అధిష్టానంపై తన మనసులోని మాటను బయటపెట్టేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు న్యాయం జరగలేదని.. తన మాట అస్సలు చెల్లట్లేదని నిట్టూర్చారు. నమ్ముకున్న కార్యకర్తలను సాయం చేయలేకపోతున్నానని.. కనీసం సీఐల బదిలీల విషయంలోనూ తనను లెక్క చేయట్లేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఏమున్నా ఎమ్మెల్యేల మాటే నెగ్గుతోందని.. తనను ఎవరూ పట్టించుకోవట్లేదని మనసులోని బాధనంతా కక్కేశారు.
గుర్తు చేసి మరీ..!
అంతేకాదు.. ఈ సందర్భంగా తాను చేసిన వీరోచిత పోరాటాలను కూడా బుద్దా గుర్తు చేసుకున్నారు.. హైకమాండ్‌కు కూడా గుర్తు చేశారు. అధినేత చంద్రబాబు ఇంటిపైకి నాటి మంత్రి జోగి రమేష్ దాడికి వెళ్తే ఎదురెళ్లి నిలబడ్డానని.. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరైనా ఉన్నారా..? కనీసం అటు వైపు అయినా వచ్చారా..? అంటూ నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగా.. 37 కేసులు పెట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పార్టీ కోసం ఇంత చేసిన తనను ఎందుకు పట్టించుకోవట్లేదు..? ఎందుకు న్యాయం చేయట్లేదు..? ఇవన్నీ నేను ఆవేదనతోనే చెబుతున్నాను కానీ.. వ్యతిరేకతతో కాదని బుద్దా స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను ఇప్పటికీ.. ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. పనిలో పనిగా ఈసారి (2029 ఎన్నికలు) ఎమ్మెల్యేగా పోటీచేస్తానన్న విషయాన్ని కూడా బయటపెట్టేశారు. అయినా ఇంత చేసిన బుద్దా పదవి అడగడంలో తప్పేమీ లేదేమో..! త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా.. ఇందులో అయినా న్యాయం జరుగుతుందేమో చూడాలి మరి.