కేరళలోని వాయనాడ్ పరిసర ప్రాంతాలు అత్యంత దారుణమైన స్థితిలో కనిపిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లడం వేరు, భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి ఊళ్లకు ఊళ్లే సమూలంగా నాశనమవడం వేరు. డాబాలు, లోగిళ్ళు, పెంకుటిళ్లు, పూరి గుడిసెలు అన్ని కొండచరియలు విరిగిన పడిన మట్టితో, రాళ్లతో కప్పడిపోవడం నిజంగా అత్యంత దయనీయం అనే చెప్పాలి.
ఇళ్లు సంగతి సరేసరి వాయనాడ్ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికి 297 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇంకా 206 మంది కనిపించక వారి బంధువులు తల్లడిల్లిపోతున్నారు. 130 ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఇండియన్ ఆర్మీ రాత్రనక, పగలనక సహాయచర్యలు చేపట్టి శ్రమిస్తోంది.
వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో వాయనాడ్, ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.