ఆధిపత్యపు అహంకారం
అధోగతి తాలూకా అవమానంగా మారడం
నెల కాలంలోనే జరిగిపోయింది.
సగటు ఓటరు నోటి మాటగా చెప్పాలంటే
గొప్ప నియంతలా ఫీలైన దూతకు
దూల తీరిపోయింది.
ఇటీవల సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఇలాంటి రాతలు, వ్యాఖ్యలు ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఎస్.. అయిదేళ్లపాటు పరదాల మాటున ఊరేగి... ఊళ్లకు, జనాలకే కాదు, సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సైతం దూరం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై పడుతోన్న సెటైర్స్ అవి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్ పతనం పట్ల సానుభూతిపరులు సవాలక్ష చెబుతున్నారు. సామాన్య ఓటర్లు శతకోటి కారణాలు చూపుతూ అందుకే సాగనంపేసాం అంటున్నారు. ఏదైతేనేం, జగనన్న భస్మాసుర హస్త పథకానికి తనను తానే లబ్దిదారుడిగా ప్రకటించుకున్నట్లు అయింది వై ఎస్ జగన్ కి.!
ఇక అసలు విషయానికి వస్తే.. విలాసవంతమైన ప్యాలెస్ తో రుషికొండను అనకొండలా మింగేద్దాం అనుకున్న వైనం గురించి, పార్టీ కార్యాలయాల అక్రమ నిర్మాణాల గురించి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అననూయులు చేసిన అక్రమాల గురించి ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తోంటే సిటిజన్లు విస్తుపోతున్నారు. నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆ విరుచుకుపడే తీరులోనూ వినోదాన్ని పండించడమే అసలు విశేషం. ఎన్నికల ఫలితాలు చూసాక హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనిపించిందని జగన్ అంటే... అక్కడి మంచు కొండలు ఆక్రమణకు గురయ్యేవి అంటూ పంచ్ లు వేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరిదే కాదు చంద్రబాబూ అని ఇటీవల జగన్ వ్యాఖ్యానించగానే... ఆ సంగతి గత ఐదేళ్లు గుర్తు రాలేదా అని గుచ్చేశారు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వై ఎస్ జగన్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
పాపులర్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందులోకి ఎంటర్ అయ్యే అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ ఇప్పటికే ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండగా అందులో జగన్ పేరును ఇరికించిన ఫన్నీ మీమ్స్ నెట్ లో దర్శనమిస్తున్నాయి. వాటికి కామెంట్స్ అయితే ఓ రేంజ్ లో వచ్చిపడుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడానికి, కోర్టుకి హాజరు కాలేని కారణం చెప్పించుకోవడానికి ఇది భలే పనికొస్తుంది. వెళ్లన్నా బిగ్ బాస్ హౌస్ కి అంటూ జగన్ కి ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. అంతేనా.. గతంలో జైలు జీవితం గడిపిన అనుభవం నీతో బిగ్ బాస్ టైటిల్ కొట్టించేస్తుంది అని ఒకరు అంటుంటే, లోపల జగనన్నకు స్క్రిప్ట్ రాసిచ్చేది ఎవెరెహే అంటున్నారు ఇంకొకరు. అదలా వుంటే.. అప్పట్లో ఇండస్ట్రీ మొత్తాన్ని వేధించినా నాగార్జున సినిమాలకి మినహాయింపు ఇచ్చాడు కదా, ఇపుడు నాగ్ కూడా జగన్ ని బిగ్ బాస్ హౌస్ లో బాగానే చూసుకుంటాడు అంటున్నారు మరొకరు. ఇలా ఎవరికి వారు ఆడేసుకుంటూ, వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీ కి వాడేసుకుంటున్నారు జగన్ ని. అయ్యో పాపం అనిపిస్తోంది కదూ .
అందుకే అంటారు మరి.. సృష్టిలో అతి భయంకర నేరం స్వయంకృతాపరాధం అని !!