ఈ కూటమి సర్కార్‌కు ఏమైంది.. ఓ వైపు రాష్ట్ర మంత్రులు.. మరోవైపు కేంద్ర మంత్రులు.. మధ్యలో ముఖ్యమంత్రి.. ఎందుకిలా..? ఓ రేంజిలో సోషల్ మీడియా.. వైసీపీ బంతాట ఆడుకుంటున్నా.. జాగ్రత్త పడట్లేదేం..! ఒకసారి.. ఒకరే అనుకుంటే సరే.. అదీ ఏదో అనుకోకుండా అనుకోవచ్చు మరి.. సంఖ్య పెరిగితే.. రోజూ అదే పనిగా పెట్టుకుంటే పరిస్థితేంటి..? ఎన్నికల ముందు చెప్పిందేంటి..? అధికారంలోకి వచ్చాక చేస్తోందేంటి..? అసెంబ్లీలో, మీడియా ముఖంగా మాట్లాడుతున్నదేంటి..? అసలేం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో..!
ఎందుకిలా..!?
సూపర్ సిక్స్.. సూపర్ సిక్స్.. వస్తాం.. అమలు చేస్తాం.. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. అభివృద్ధి.. విజనరీ! ఇవీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు. సీన్ కట్ చేస్తే.. ఇసుకతో మొదలై సమగ్ర భూ రీ-సర్వే దాకా వచ్చి ఆగింది.. ఇది ఇక్కడితే ఆగుతుందా అంటే.. అస్సలు ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట..! అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అమ్మకు వందనం పథకం సంగతి ఏమైందనే ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందనేది మనందరం చూసే ఉంటాం. డేటా లేదు.. ఈ ఏడాది కాదు వచ్చే ఏడాదే అని సింపుల్‌గా తేల్చేశారు. దీంతో అమ్మకు పంగనామం పెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మూడు ఉచిత సిలిండర్ల విషయానికొస్తే.. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదని ఇదే అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇక సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోంది.. ప్రజలకు హామీలిచ్చాం అని ఒక్కసారిగా.. అదీ సీఎం చంద్రబాబు నోట మాట రావడంతో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కిపడింది. అసలేం రుగుతోందో అర్థం కావట్లేదని ఓట్లేసి గెలిపించిన ఆందోళన చెందుతున్న పరిస్థితి.
అటు ఆరోగ్య శ్రీ.. ఇటు ఖజానా..!
ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆరోగ్య శ్రీ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. అసలు ఆయన మాటలతో ఆరోగ్య శ్రీ ఉందా లేదా అన్నట్లుగా సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఆలోచనలో పడిన పరిస్థితి. ఆరోగ్య శ్రీ పూర్తిగా తీసేసి.. కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలనుకుంటున్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏపీ ఖజనా ఖాళీ అయ్యింది.. సున్నా అంటే సున్నా అని పురపాలక శాఖ మంత్రి నారాయణ అని మీడియా వేదికగా స్టేట్మెంట్ ఇవ్వడమేంటి..? ఇది ఎంతవరకూ సబబు అని తెలుగు తమ్ముళ్లే ఆలోచనలో పడిన పరిస్థితి. ఇక తాజాగా.. లోకేష్ ఏ శాఖను వదట్లేదు అన్ని డిపార్టమెంట్లలోనూ వేలు పెడుతున్నారని మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సైతం పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి. అయినా ఇలా సోషల్ మీడియా ఈ రేంజిలో ఉన్న ఇప్పుడు.. అసెంబ్లీ, మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడితే ఎలా ఉంటుందనేది పసిగట్టకపోతే ఎలా..? పోనీ వీరిలో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారంతా సీనియర్ మంత్రులే.
యూటర్న్‌లు..!
నాడు.. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన సమగ్ర భూ రీసర్వే ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఇది మంచిదే కంటిన్యూ చేస్తామని ప్రభుత్వమే ప్రకటన చేయడం గమనార్హం. ఇదొక యూటర్న్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత ఇసుక అని లేనిపోని ఛార్జీలు వసూలు చేస్తారనే ఆరోపణలతో కూటమి సర్కార్ రావాల్సిన చెడ్డపేరు వచ్చేసిందన్నది అందరికీ తెలిసిందే. నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు.. తవ్వకం, రవాణా చార్జీలు ఎందుకు పెరిగాయి?.. ప్రజలే రవాణా చేసుకునేలా వెసులుబాటు ఎందుకు కల్పించలేకపోతున్నారని అధికారులపై కన్నెర్రజేసిన పరిస్థితి. అంతేకాదు.. గ్రామ సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ పర్మిట్లు ఇవ్వాలని గనుల శాఖ సమీక్షలో క్లియర్ కట్‌గా ఆదేశాలిచ్చేశారు. చూశారుగా.. ఓ వైపు మంత్రులు ఏదేదో చెప్పేయడం.. ఓ వైపు పథకాలు.. ఇంకోవైపు హామీలు.. ఇలా నడుస్తోంది కూటమి సర్కార్ అంటూ విమర్శలు, లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చేస్తున్నాయ్. వీటన్నింటికీ స్వయంగా సీబీఎన్ రంగంలోకి దిగి కవర్ చేయాల్సిన పరిస్థితి తెస్తున్నారని విశ్లేషకులు చెబుతన్న మాటలు. అందుకే.. మాట మాట్లాడే ముందు అదీ మీడియా కావొచ్చు.. అసెంబ్లీ అవ్వొచ్చు.. ఆచి తూచి విమర్శలకు తావివ్వకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే కూటమి ప్రభుత్వం ఎక్కడ చిక్కుతుందా..? అని వేయి కళ్లతో ఎదురుచూపుల్లో వైసీపీ.. సోషల్ మీడియా మీడియా వేచి చూస్తోందన్న సంగతి కాస్త తెలుసుకుని మెలిగితే మంచిది మరి.