ఆగస్టులో అన్నొస్తున్నాడని చెప్పండి..!
అవును.. ఆగస్టులో అన్నొస్తున్నాడని చెప్పండి..! అక్కా.. చెల్లి.. అన్న.. తమ్ముడు.. అందరికీ ఒక మాట చెప్పండి..! ఓటేసిన కార్యకర్తలు, ఓటేయని ప్రజలు అందరి కోసమూ వస్తున్నానని చెప్పేయండి..! ఇప్పట్నుంచే షురూ చేయండి..! ఇవీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కీలక నేతలు, జిల్లాల ఇంచార్జీలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చెప్పిన మాటలట. ఇక మీడియా, సోషల్ మీడియాలో ఎలా మేనేజ్ చేయాలి..? అనే విషయాలన్నింటినీ ఓ పెద్ద తలకాయకు అప్పగించి చూస్కోమని చెప్పారట. ఇంతకీ ఆయనొచ్చి ఏం చేస్తారు..? నియోజకవర్గాల వేదికగా ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
జగన్ ప్లాన్ ఇదేనట..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితం అయిన వైఎస్ జగన్.. వినుకొండ వైసీపీ కార్యకర్త రషీద్ హత్యతో రంగంలోకి దిగిపోయారు. ఇక ఢిల్లీ ధర్నాతో యమా యాక్టివ్ అయిపోయారన్నది కార్యకర్తలు, అభిమానుల నుంచి వస్తున్న మాట. ఇకపై యాక్టివ్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రత్యర్థి పార్టీల మీద వ్యూహాలు రచిస్తూనే.. పార్టీపై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారని వైసీపీ వర్గాల సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్లు కూల్.. ఇక పూర్తి మాసివ్ యాంగిల్‌లోకి వెళ్తారట. అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాలు.. జిల్లాల వారీగా నేతల మధ్య నెలకొన్న మనస్పర్థలు, సమన్వయ లోపం ఇవన్నీ సరిచేయడానికి జగన్ రంగంలోకి దిగుతున్నారట. శ్రావణ మాసం ఆగస్ట్-05న ప్రారంభం కానుండటంతో.. ఆ రోజే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట.
ఏం జరుగుతుందో..?
ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లోని పార్టీల ముఖ్య నేతలు, పోటీ చేసిన అభ్యర్థులను నేరుగా కలిసి, గొడవలు లేకుండా సర్ది చెప్పి అందర్నీ ఒక్కటి చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. దీనికి తోడు బూత్ కమిటీలు ఇలా అన్నీ కొత్తగా చేయబోతున్నారట. ఎందుకంటే.. ఇదివరకటి కమిటీలతో నేతలకు సమన్వయ లోపం, ప్రత్యర్థి పార్టీలకు పనిచేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఇక ఆ కమిటీలను రద్దు చేసి.. కొత్త వైసీపీగా చేయబోతున్నారట. ఈ ప్రక్షాళనకు సంబంధించి రూట్ మ్యాప్ మొత్తం సిద్ధమైందట. ఇంచార్జీలు, పట్టణ అధ్యక్షులు, యువజన సంఘాలు ఇలా అన్నీ మార్చేస్తారట. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిసింది. మరీ ముఖ్యంగా స్థానికులకు పెద్ద పీట వేసి.. ఇప్పటికైనా నేతలు చెప్పిన మాటలు కాస్త చెవిన వేసుకుని.. పార్టీ పునాదులను బలంగా మార్చడానికి సర్వం సిద్ధం చేస్తున్న జగన్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి మరి.