రేణు దేశాయ్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య. సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ చేసినా.. మీడియా ముందుకొచ్చినా ఏం మాట్లాడుతారో అని జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు అయితే ఇక అదే పనిగట్టుకుని మరీ ఎదురుచూస్తుంటారు. ఎక్కడ పవన్ గురించి కామెంట్ చేస్తారో.. ఎలా కౌంటర్ ఇవ్వాలా అని వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్.. రేణు దేశాయ్ కలవబోతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి..? ఆ కిక్కు ఎలా ఉంటుందో..? అవును మీరు వింటున్నది నిజమే. త్వరలోనే ఈ ఇద్దరు భేటీ కాబోతున్నారు..? ఎందుకు..? ఏమిటి..? ఏ విషయంలో అనేది తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు కథ..!
ఆ మధ్య రెండో పెళ్లి అని హడావుడి చేసిన రేణు ఎందుకో అటు అడుగులు వేయలేదు. ఆ తర్వాత కొడుకు అకీరాను యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించి.. కుమార్తెను చదివిస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే.. ఏమైందో తెలియట్లేదు కానీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్‌గా రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వేదాలు, భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ఆమె.. ఇటీవలే తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యి విషయం చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు ఇన్‌సైడ్ టాక్. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా కలవబోతున్నారట.
పవన్ ఏమంటారో..?
తొలుత పవన్‌తో భేటీ అయ్యి.. తన మనసులోని మాటను బయటపెట్టి అభిప్రాయం తెలుసుకోనున్నారని సమాచారం. ఆ తర్వాత యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రంలోని పెద్దలు.. రాష్ట్రం నుంచి అన్ని అనుమతులు మీరే చూడాలని కోరబోతున్నారట. అయితే సేనాని ఏమంటారు..? సరే అన్నీ చూసుకుంటానని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేకుంటే రెడ్ సిగ్నల్ ఇస్తారా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాల బార్డర్ లో లేదా అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్శిటీ నెలకొల్పో యోచనలో రేణుదేశాయ్ ఉన్నారని రాజకీయ, సినీ వర్గాలు చెబుతున్నాయి. యూనివర్శిటీ సంగతి అటుంచితే.. ఈ ఇద్దరూ కలుస్తున్నారనే వార్త అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫైనల్ రేణు పని ఏమవుతుందో చూడాలి మరి.