లోకేష్ సీఎం ఎప్పుడవుతారు..!?
అన్నీ అనుకున్నట్లే జరిగాయి..! ఏపీ రాష్ట్రమంతా యువగళం పాదయాత్ర చేశారు..! యువతను తమవైపు తిప్పుకొని సైకిల్ గుర్తుపై ఓట్లు గుద్దించారు..! ఓ వైపు నారా చంద్రబాబు, మరోవైపు పవన్ కల్యాణ్.. ఇంకోవైపు యువనేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారం చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఇక ముందుగా చెప్పినట్లే పవన్‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యతే ఇచ్చారు. అన్నీ సరే కానీ.. లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు..? ఈ టర్మ్‌లో అవుతారా..? లేదా..? ఒకవేళ అయితే ఎప్పుడు అవుతారు..? ఇప్పుడివే టీడీపీ శ్రేణులు, వీరాభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు.
ఏం జరుగుతోంది..?
పరిస్థితులన్నీ బాగున్నప్పుడే చేయాల్సినవి చేస్తే బాగుంటుందన్నది టీడీపీ కార్యకర్తల్లో ఓ వర్గం నుంచి వస్తున్న మాట. అదే.. లోకేష్‌ను సీఎం చేయడమే..! ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో అదే టర్మ్ ముగిసేలోపు 2027 చివరిలో.. లేదా 2028 మొదట్లో అయినా యువనేతను ముఖ్యమంత్రి చేసి తీరాల్సిందేనన్న డిమాండ్ సర్వత్రా వస్తోందట. తొందరపడొద్దు.. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అని చంద్రబాబు సముదాయిస్తూ వస్తున్నారట. అవన్నీ మాకు అక్కర్లేదు కానీ.. ఈ దఫా చేస్తారా లేదా అన్నది మాత్రమే కావాలని యంగ్ ఎమ్మెల్యేలు, లోకేష్ వర్గం గట్టిగానే పట్టుబడుతోందట. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చేసి తీరుదాం.. అయితే ఇప్పుడు అసలు ఈ మాటలు మాట్లాడుకోవడానికి కూడా సరైన సమయం కాదని సున్నితంగా.. అది కూడా స్వీట్ వార్నింగ్ పంపేశారట సీబీఎన్. మరోవైపు.. ఇదే జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంగతేంటి అనేది పైనున్న పెరుమాళ్లకే తెలియాలి. అప్పుడిక ఎంత వ్యతిరేకత వస్తుందో.. ఎన్నెన్ని జరుగుతాయో ఏంటో!
ప్లాన్ అందుకేనా..?
వాస్తవానికి.. ఏపీ కేబినెట్‌లోకి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి లోకేష్‌ను ఎప్పుడైనా గద్దెను ఎక్కించాలన్నదే ప్లాన్ అట. అందుకే ఏరి కోరి మరీ ఎవరైతే యువనేతకు సూటబుల్ అవుతారు..? ఇప్పట్నుంచి మెరుగు పడితే టర్మ్ చివరికి పనికొస్తారు..? అని చంద్రబాబు, లోకేష్‌లు కేబినెట్‌లోకి తీసుకున్నారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగి.. ముఖ్యంగా రాష్ట్రం కాస్త అభివృద్ధి, పారిశ్రామికంగా.. రాజధాని విషయంలో ఇవన్నీ కాస్త గాడిన పడిన తర్వాత వారసుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నది చంద్రబాబు మనసులో అయితే గట్టిగానే ఉందట. అయితే.. దానికి సమయం, సందర్భం వస్తుందని అది కూడా 2027 చివర్లో వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా సీబీఎన్ అనుకుంటున్నారట. మరి ఇది ఎప్పుడు నిజమవుతుందో.. అసలు చంద్రబాబు ఈ సీఎం ప్రస్తావన అనేది ఉందా లేదా..? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.