అవును.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇప్పుడొక్కటే చర్చ..! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తే.. నిమిషాల్లోనే సోదరి వైఎస్ షర్మిల బయటికెళ్లిపోతారు..! అదేనండోయ్.. ఢిల్లీ వేదికగా వైసీపీ తలపెట్టిన ధర్నాకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మద్దతివ్వడం.. త్వరలోనే కూటమిలో ఈయన చేరిపోతారనే వార్తలు ఇప్పుడు పెద్ద బర్నింగ్ టాపిక్కే అయ్యాయి. ఎందుకంటే.. ఇద్దరూ ఒక తల్లి కడుపునే పుట్టినా, ఒకరంటే ఒకరికి ఎదురుపడితే ఏదైనా చేసేయాల్సిందేనన్నట్లుగా కోపతాపాలు ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది అన్న, చెల్లి ఇద్దరూ ఒక్కటేలా ఉండాలంటే అయ్యే పనేనా..! వందకు వెయ్యి శాతం కాదు కాదంటే కాదంతే..!
అయ్యే పనేనా..!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అస్సలు ఉండరు..! అలాంటిది ఏదో ఆస్తి పాస్తుల విషయాల్లో మనస్పర్థలు, గొడవలు అనేవి కుటుంబంలో సర్వసాధారణం. అదే సమస్యకు పరిష్కారం దొరికితే ఒక్కటవ్వచ్చు.. ఎంచక్కా మునుపటిలాగే ఫ్యామిలీతో గడిపేయచ్చు. కానీ.. ఇది వైఎస్ జగన్-షర్మిల విషయంలో అయ్యే పనేనా అంటే ఏ మాత్రం ఇసుమంత కూడా కనిపించట్లేదు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఎంతో కొంత సోదరి కూడా కారణమన్నది జగన్ భావన్. అందుకే చెల్లిపై పీకల్లోతు కోపం పెరుగుతోందే తప్ప తగ్గిందేమీ లేదు. దీనికి తోడు అధికారంలో లేకున్నా అన్ననే ప్రశ్నిస్తూ వస్తుండటం.. మీడియా ముందుకు వచ్చినప్పుడు వారసత్వం, వారసుడు.. అసలు జగన్ ఆఫ్ట్రాల్ అన్నట్లుగా సెటైర్లు, డైలాగ్స్ పేల్చుతూనే ఉన్నారు.
అటు.. ఇటు.. ఎటో..!
వాస్తవానికి వైఎస్ జగన్‌కు ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఆయనపై మెడ చుట్టూ ఉన్న అక్రమాస్తుల కేసులు, దీనికి తోడు త్వరలో కూటమి సర్కార్ పెట్టబోయే కేసులు ఎప్పుడైనా బిగుసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడపడానికి ఒక్కరంటే ఒక్కరు లేరు. అందుకే.. ఇండియా కూటమిలో చేరితే సపోర్టు దొరుకుతుందన్నది వైసీపీ భావన అని టాక్. అయినా కేంద్రంలోని మోదీని ఎదురించి ఇలా చేయడం అంటే పెద్ద సాహసమే. బహుశా న.మో గురించి జగన్‌కు తెలిసినంత ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి. పోనీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవుతుందా అంటే అబ్బే ఇప్పటికీ ఎప్పటికీ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. అయినా జగన్‌ను అంత తక్కువ అంచనా వేయడానికి లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో.. ఎవరికి బద్ధ శత్రువులు అవుతారన్నది ఎవరికీ అర్థం కాదు.. ఊహించలేం కూడా.
సయోధ్య కుదిర్చేదెవరు..?
ఒకవేళ జగన్ ఇటు ఇండియా కూటమిలోకి వస్తే.. నిమిషాల్లోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేసి బయటికి వెళ్లాలన్నది షర్మిల ఆలోచనట. అలా కాకుండా కూటమి కట్టినా.. కట్టకపోయినా షర్మిల ఏం కావాలో ఇచ్చేసి వైసీపీలో ఏదో ఒక కీలక పదవి ఇచ్చేసి.. నంబర్-02ను చేయాలన్నది పార్టీలో వస్తున్న డిమాండ్ అట. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా కొన్ని రోజులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తన అత్యంత సన్నిహితులతో జగన్ చర్చలు జరుపుతున్నారట. అందుకే అస్తమానూ యలహంక ప్యాలెస్‌కు ఆయన వెళ్తున్నారని టాక్. రెండే ఆప్షన్లు.. వైసీపీలోకి వచ్చి ముందుకెళ్లడమా.. లేదంటే ఇండియా కూటమిలో చేరినా సరే కలిసి ముందుకెళ్లి.. కష్టకాలంటే పార్టీని కాపాడటమా..? ఈ రెండింటిలో చాయిస్ మీదేననే షర్మిలతో డీకే చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అసలు షర్మిల మనసులో ఏముందో..? ఇదంతా నిజమా కాదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.