ఆపద అంటే అరక్షణంలో వాలిపోతా!
అయిన వాళ్లకి కష్టం వస్తే ఆలస్యంగా వస్తానేమో.. అదే ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగను! టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోట వచ్చిన ఈ డైలాగ్ మనం ఎన్నో సార్లు వినే ఉంటాం..! ఇదంతా రీల్ అయితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇదంతా నిజ జీవితంలో అదేనండోయ్ రియల్‌గా చేసి చూపిస్తున్నారు..! ఆపద అంటే అరక్షణంలో వాలిపోతా అంటున్నారు! పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే.. ప్రజలకోసమే పుట్టిన పార్టీ జనసేన అని పదే పదే సేనాని నోట వచ్చిన అక్షరాలా నిజ చేసి చూపిస్తున్నారు..! ఎవరు ఎక్కడి నుంచైనా సరే ఇదిగో ఫలానా కష్టం వచ్చిందని కానీ.. ఇదీ మా ఇబ్బంది అని చెబితే చాలు నిమిషాల్లోనే పరిష్కారం చూపించేస్తున్నారు సేనాని.
ప్రజా పాలన!
ప్రజల వద్దకే పాలన అంటూ జనసేన కార్యాలయం కేంద్రంగా జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరు ఎలాంటి సమస్యలు దరఖాస్తు రూపంలో చెప్పినా నిమిషాల్లో పరిష్కారం చేసేశారు. దీంతో అందరి మనసు గెలుచుకున్నారు గబ్బర్ సింగ్. తిరుపతి జిల్లా వెంకటగిరి బాధితుల నుంచి ఓ లేఖ వచ్చింది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు.. తమ సమస్య తెలుపుతూ పవన్‌కు ఓ అర్జీ పెట్టుకున్నారు. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో తిరుగుతూ.. విద్యార్థినులు, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారన్నదే ఆ అర్జీ సారాంశం. అంతేకాదు.. అమ్మాయిల ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, నిందితుల ఫొటోలతో సహా జతచేసి పంపారు.
వణికిపోవాలి..!
ఆడపడుచులు అర్జీని చూసిన పవన్ కల్యాణ్.. చలించిపోయారు. వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడికి స్వయంగా కాల్ చేసిన సేనాని అసలేం జరుగుతోంది..? ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇలాంటి ఆకతాయిలు రోడ్లపై తిరగాలంటే వణికిపోయేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. డిప్యూటీ సీఎం నుంచి కాల్ రావడంతో వణికిపోయిన పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగిపోయి.. ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షించే పనిలో పడ్డారు. నాడు ఆడపిల్లలకు రక్షణ, శాంతి భద్రతల గురించి పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదీ.. ఇదీ సార్ పవన్ అంటే అని జనసైనికులు, అభిమానులు వీడియోలను షేర్ చేస్తూ.. సరైనోడి చేతికి పగ్గాలు వస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని అని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.