వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా.. హిట్ అయ్యిందా..? అట్టర్ ఫ్లాప్ అయ్యిందా..? ఇప్పుడిదే మీడియా, సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ.! ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పితే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే ఎవరో మద్దతు ఎందుకిస్తారు..? ఇక్కడున్న ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు కనీసం పట్టించుకోలేదు.. ఇక ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు..? ఎవరికేం అవసరం..? అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని రీతిలోనే స్పందన వచ్చిందని.. ధర్నా సూపర్ సూపర్ హిట్ అయ్యిందని వైసీపీ పెద్దలు చెబుతున్న మాట. అది ఎలా..? ఏంటి..? అనే విషయాలు చూసేద్దాం వచ్చేయండి మరి.
వచ్చారు.. మాట్లాడారు!!
ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నాకు మద్దతు ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, అన్నాడీఎంకే, వీసీకే పార్టీలు.. ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఆయా పార్టీల నుంచి ఎంపీలు, ముఖ్య నేతలు వచ్చి.. ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ చూసి సంఘీ భావం తెలిపి, కార్యక్రమంలో మాట్లాడారు కూడా. ఇవాళ ఒకరు.. రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు కానీ ప్రాణాలు తీయడం, దాడులు, విద్వంసం పద్ధతి కాదని ముక్త కంఠంతో ఖండించారు. అఖిలేష్ యాదవ్, సంజయ్ రావత్, తంబీదురై లాంటి వారు మాట్లాడుతూ పనిలో పనిగా వారి సొంత రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు గురుంచి కూడా ప్రస్తావించారు కూడా..!
సర్వం సాయిరెడ్డి..!
ఢిల్లీ వేదికగా ధర్నా సక్సెస్ కావడానికి కర్త, కర్మ, క్రియ మొత్తం ఎంపీ, వైసీపీ కీలకనేత విజయసాయి రెడ్డి అని అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ఇన్నేళ్ళ ఎంపీగా ఆయనకున్న పరిచయాలతో ఇప్పుడు ధర్నాకు అందరినీ పిలిపించి, మాట్లడించారని.. అంతేకాకుండా కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా వచ్చి మద్దతు ఇచ్చారే తప్ప ఎక్కడా పార్టీల అధిపతులు కానీ, ముఖ్యనేతలు రాలేదన్న విషయాన్ని విమర్శకులు లేవనెత్తుతున్నారు నెటిజన్లు. ఏదైతేనేం విజయసాయిరెడ్డికి ఏదైనా బాధ్యత అప్పగిస్తే.. ఏం చేసైనా సరే సక్సెస్ చేస్తారని వైసీపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. మళ్ళీ 2014-2019లో పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయని.. ఇదే మేము కోరుకుంటన్నది అని కొందరు కార్యకర్తలు, పాత కాంబో జగన్ - సాయిరెడ్డి అదిరిపోయిందని మరికొందరు నేతలు చెప్పుకుంటున్నారు.
ఓహో ఇదా అసలు సంగతి!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇండియా కూటమిలో చేరతానని వైఎస్ జగన్ మాటిచ్చారని అందుకే కూటమిలోని పార్టీలు ధర్నాకు మద్దతు ఇచ్చాయనే వార్తలు సైతం ఢిల్లీలో గుప్పుమంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది వైఎస్ జగన్ రెడ్డికే తెలియాలి మరి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇండియా కూటమి హ్యాండిల్ చేస్తున్న ట్విట్టర్ పేజీలో జగన్ చేపట్టిన ధర్నా గురుంచి ట్వీట్ చేయడం.. Game is on అంటూ మరో ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో.. తల్లి కాంగ్రెస్ పార్టీతో పిల్ల కాంగ్రెస్ వైసీపీ కలిసిపోయిందన్న మాట అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకేనా.. ఢిల్లీకి వెళ్లి ఇంత హడావుడి చేసింది.. వైసీపీ కార్యకర్తలం అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ కొందరు వీరాభిమానులు తిట్టి పోస్తున్నారు. ఇక ఎలాగో వైఎస్ జగన్, సాయిరెడ్డికి ఉన్న పాత పరిచయాలతో జాతీయ మీడియాను మేనేజ్ చేశారనే విమర్శలు లేకపోలేదు. సో.. ఢిల్లీ ధర్నా ఫ్లాప్ అంటే జగన్ చేతకావట్లేదని.. ఒకవేళ సక్సెస్ అని అనుకుంటే అది సాయిరెడ్డి వల్లే అని చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట..!!