వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పట్నుంచీ అరాచకాలు ఎక్కువయ్యాయని.. దీన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక రాజకీయాలు దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఢిల్లీని వేదిక చేసుకుంది వైసీపీ. బుధవారం నాడు చేపడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. వాటిలో కొన్నింటినీ చూసేద్దాం వచ్చేయండి మరి..!
మనశ్శాంతి.. శాంతి!
ట్విట్టర్ వేదికగా జగన్ ఢిల్లీ ధర్నాపై చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినా.. జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఒక్కటే. ఇద్దరికీ ఎక్కడ ఏం చేయాలో... ఎలా చేయాలో... ఎందుకు చేయాలో తెలియదు పాపం అంటూ జగన్, విజయసాయిరెడ్డి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఓ రేంజిలో టీడీపీ కార్యకర్తలు ఆడుకుంటున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. బాగో లేనిదల్లా రెండు మాత్రమే. ఒకటి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి, మనశ్శాంతి. మరోవైపు విజయ్ సాయి రెడ్డి శాంతి మాత్రమే అంటూ తాజా పరిణామాలను జతచేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు.
మెడలు వంచడానికా..?
మొదటిసారి కేంద్రం మెడలు వచ్చిన వైఎస్ జగన్.. అదెలాగంటే జగన్ ఢిల్లీ ధర్నా ముందు, కేంద్రం మెడలు వంచి నిధులు కేటాయించేలాగా చేయడానికే.. అని మరికొందరు జనసేన కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తు్న్నారు. 5 ఏళ్లలో జగన్ చేసిన తప్పులను అసెంబ్లీలో ఎత్తి చూపుతుంటే వాటిని ఎదుర్కొనలేక సాకులు చెబుతూ ఢిల్లీకి పారిపోయారని అందరికీ అర్థమైందంటూ నెటిజన్లు మీమ్స్, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయినా.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన విషయం నిజమే అయితే ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమొస్తుంది..? అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదని కొందరు వైసీపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క పార్టీ ధర్నాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించలేదు. ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.